హెచ్2లో భారీగా నియామకాలు
ఏఐ ఆధారిత జాబ్స్ కూడా
79 శాతం మంది హెచ్ఆర్ లీడర్లది ఇదే మాట
నౌకరీ సర్వే రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: ఏఐ టెక్నాలజీల వల్ల ఒకవైపు భారీగా ఉద్యోగాలకు కోత పడుతున్నప్పటికీ, మరోవైపు పెద్ద సంఖ్యలో అవకాశాలు కూడా వస్తున్నాయి. కాబట్టి నిరుద్యోగులు నిరాశపడాల్సిన అవసరం లేదని హ్యుమన్ రిసోర్సెస్(హెచ్ఆర్) ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ ఏడాది హెచ్2 (జూన్–డిసెంబరు)లో నియామకాలు భారీగా ఉంటాయని అంటున్నారు.
జాబ్పోర్టల్ నౌకరీ విడుదల చేసిన హెచ్2 2026 హైరింగ్ ఔట్లుక్ సర్వే ప్రకారం... కార్పొరేట్ కంపెనీల్లో నియామకాలు ఊపందుకోనున్నాయని ఈ సర్వేలో పాల్గొన్న 540 మందికి పైగా సీనియర్ హెచ్ఆర్ లీడర్లు, నిపుణులు వెల్లడించారు. 2026 రెండో అర్ధభాగంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు రెడీగా ఉన్నాయని 79 శాతం మంది స్పష్టం చేశారు.
రాబోయే ఆరు నెలల్లో నియామకాల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగుతుందని 97 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇన్ఫో ఎడ్జ్ ఎండీ హితేష్ ఒబెరాయ్ మాట్లాడుతూ, భారత ఉద్యోగ మార్కెట్ వేగంగా ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. ఐటీ, మార్కెటింగ్, అనలిటిక్స్ రంగాలలో ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోందని తెలిపారు. ఉద్యోగులు నిరంతరం తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
రియల్ ఎస్టేట్లో అత్యధికం
మిగతా సెక్టార్లతో పోలిస్తే రియల్ ఎస్టేట్లో కొత్త ఉద్యోగాలు అత్యధికంగా ఉంటాయని 86 శాతం మంది హెచ్ఆర్ లీడర్లు వెల్లడించారు. ఎఫ్ఎంసీజీ రంగంపై 85 శాతం మంది, ఐటీ రంగంపై 83 శాతం మంది సానుకూలంగా స్పందించారు. మ్యానుఫ్యాక్చరింగ్ , హెల్త్ కేర్ రంగాలలో కొత్త నియామకాలు బాగుంటాయని 79 శాతం మంది అన్నారు.
బీఎఫ్ఎస్ఐ రంగంలో 72 శాతం మంది కొత్త ఉద్యోగాలను అంచనా వేస్తున్నారు. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఐటీ విభాగాలలో నియామకాలు అత్యధిక స్థాయిలో ఉండొచ్చు. యువ నిపుణుల కోసం డిమాండ్ భారీగా పెరిగింది. 0–3 ఏళ్ల అనుభవం గల వారిని తీసుకోవాలని 62 శాతం మంది లీడర్లు కోరుకుంటున్నారు. 4–7 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణుల కోసం 57 శాతం మంది ఎదురుచూస్తున్నారు.
ఏఐ టెక్నాలజీలతో మేలే ఎక్కువ..
ఏఐ టెక్నాలజీల కారణంగా సమీప భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం లేదని 86 శాతం మంది హెచ్ఆర్ ఎక్స్పర్ట్స్ స్పష్టం చేశారు. ఐటీ , బీఎఫ్ఎస్ఐ రంగాలలో 20 శాతం మందికిపైగా ఏఐ కారణంగా సరికొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. ఉద్యోగుల నైపుణ్యాలను ప్రస్తుత ఉద్యోగ అవసరాలకు తగినట్లు మార్చడం యాజమాన్యాలకు పెద్ద సమస్యగా మారింది.
హెచ్ఆర్ లీడర్లలో 31 శాతం మంది ఈ విషయాన్ని అంగీకరించారు. హెల్త్ కేర్ రంగంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. రాబోయే ఆరు నెలల్లో ఉద్యోగుల తొలగింపు రేటు 15 శాతం కంటే తక్కువగా ఉంటుందని 83 శాతం మంది లీడర్లు అంచనా వేస్తున్నారు. దాదాపు 58 శాతం మంది యజమానులు జీతాల పెంపుదలపై సానుకూలంగా ఉన్నారు. భారతీయ ఉద్యోగ మార్కెట్ రాబోయే రోజుల్లో మరింత విస్తరించనుందని ఈ సర్వే స్పష్టం చేసింది.
