రియల్‍ టైమ్‍ ఫీడర్‍ మానిటరింగ్‍ సిస్టంలో కరీంనగర్‍ టాప్

రియల్‍ టైమ్‍ ఫీడర్‍ మానిటరింగ్‍ సిస్టంలో కరీంనగర్‍ టాప్
  • వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‍ సేవల్లో నయా టెక్నాలజీ
  • కరెంట్​సరఫరా అంతరాయాలను క్షణాల్లో తెలుసుకునే వీలు 
  • సర్కిల్‍ పరిధిలో 82 సబ్‍ స్టేషన్లతో ‘స్కాడా’కు అనుసంధానం
  • 18 జిల్లాల పరిధిలో కరీంనగర్‍ సర్కిల్‍కు ప్రత్యేక గుర్తింపు 
  • త్వరలో హనుమకొండ, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్‍ సర్కిళ్లు

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో 18 జిల్లాల పరిధిలో విద్యుత్‍ సేవలు అందిస్తున్న టీజీఎన్‍పీడీసీఎల్‍ సంస్థలో 100 శాతం రియల్‍ టైమ్‍ ఫీడర్‍ మానిటరింగ్‍ సిస్టం (ఆర్‍టీఎఫ్‍ఎంఎస్‍) పూర్తిచేసిన సర్కిల్‍గా కరీంనగర్‍ నిలిచింది. 82 సబ్‍ స్టేషన్లను సంస్థ ప్రధాన కార్యాలయం కేంద్రంగా పనిచేసే సూపర్‍వైజరీ కంట్రోల్ అండ్‍ డేటా అక్విజిషన్‍ (స్కాడా)తో అనుసంధానం పూర్తిచేసిన తొలి సర్కిల్ గా ప్రత్యేక గుర్తింపు సాధించింది. 

కరెంట్‍ ఎక్కడపోయిందో క్షణాల్లో చెప్తది
టీజీఎన్‍పీడీసీఎల్‍ పరిధిలో 18 జిల్లాల్లో వినియోగదారులకు విద్యుత్‍ సేవలు అందిస్తున్నారు. కాగా, సేవల్లో టెక్నాలజీని అందిపుచ్చుకునే క్రమంలో సంస్థ ‘రియల్‍ టైమ్‍ ఫీడర్‍ మానిటరింగ్‍ సిస్టం’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సిస్టం ద్వారా విద్యుత్‍ ఫీడర్ల పనితీరును సకాలంలో (రియల్‍ టైమ్‍) పర్యవేక్షించవచ్చు. మాములుగా అకాల వానలు, ఈదురు గాలులు వంటి ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక కారణాల వల్ల బ్రేక్ డౌన్ జరిగి విద్యుత్‍ సేవల్లో అంతరాయాలు వస్తుంటాయి. వీటిని గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టకుండా రియల్‍ టైం ఫీడర్‍ మానిటరింగ్‍ సిస్టంను  అందుబాటులోకి 
తెచ్చారు.

‘స్కాడా’కు..కరీంనగర్‍ 82 సబ్‍ స్టేషన్లు 
ఎన్‍పీడీసీఎల్‍లో కొత్తగా అమలు చేస్తున్న రియల్‍ టైం ఫీడర్‍ మానిటరింగ్‍ సిస్టంను గ్రేటర్‍ వరంగల్లోని విద్యుత్‍ భవన్‍ కేంద్రంగా అధికారులు ఆపరేట్‍ చేస్తున్నారు. దీనికోసం ఇక్కడ  స్కాడా రూపంలో ఓ బృందం పనిచేస్తోంది. ఈ క్రమంలో విద్యుత్‍ సరఫరా వ్యవస్థలోని 33కేవీ, 11 కేవీ సుధూర లైన్లలో దాదాపు 2,500 ప్రదేశాల్లో ఫాల్ట్​ ప్యాసేజ్ ఇండికేటర్లు (ఎఫ్‍పీఐ)  అనుసంధానం చేశారు. 18 జిల్లాల పరిధిలో 1,005 సబ్‍ స్టేషన్లలో ద్వారా స్కాడాకు అనుసంధానం చేశారు. కాగా, కరీంనగర్‍ సర్కిల్‍ పరిధిలో 82 సబ్‍ స్టేషన్లు ఉండగా.. అన్నింటిలో ఆర్‍టీఎఫ్‍ఎంఎస్‍ పనులు పూర్తిచేసి 100 శాతం స్కాడాకు అనుసంధానం చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. తద్వారా విద్యుత్‍ సేవల్లో అంతరాయాలు ఏర్పడితే ఆర్‍టీఎఫ్‍ఎంఎస్‍ ద్వారా వెంటనే స్కాడాకు సమాచారం చేరి నిమిషాల వ్యవధిలో సమస్య ఏంటో, ఎక్కడుందో  క్షణాల్లో కంట్రోల్‍ సెంటర్‍కు తెలుపుతుంది.

ఆర్‍టీఎఫ్‍ఎంఎస్‍లో కరీంనగర్‍ ఫస్ట్​
విద్యుత్‍ శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‍ మిట్టల్‍ సహకారంతో టీజీఎన్‍పీడీసీఎల్‍ల్లో నాణ్యమైన విద్యుత్‍ సేవలు అందించేందుకు సబ్‍ స్టేషన్లన్నింటిని ఆర్‍టీఎఫ్‍ఎంఎస్‍ టెక్నాలజీని తీసుకొస్తున్నాం. కరీంగనర్‍ సర్కిల్‍ తన పరిధిలోని 82 సబ్‍ స్టేషన్లను ఆర్‍టీఎఫ్‍ఎంఎస్‍ పూర్తి చేసుకున్న తొలి సర్కిల్‍గా గుర్తింపు తెచ్చుకుంది. సంస్థలో ఇప్పటివరకు 1,005 సబ్‍ స్టేషన్లు పూర్తి చేశాం. త్వరలో హనుమకొండ, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్‍లో సైతం 100 శాతం సబ్‍ స్టేషన్లను స్కాడాకు అనుసంధానం చేస్తాం.

కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్‍ (టీజీఎన్‍పీడీసీఎల్‍ సీఎండీ)