ప్రపంచానికి ప్రయోజనకరమైన ఒక గొప్ప మేలు జరిగినా లేదా తీవ్ర నష్టం కలిగించే ఒక భారీ విధ్వంసం సృష్టించినా అందుకు కారణం.. వీటి వెనుకనున్న వ్యక్తుల మనసులే. మన మనసుల్లో పుట్టే ఆలోచనలు కార్యరూపం దాల్చి వ్యక్తులను, వ్యవస్థలను, దేశాలను పురోగతి వైపు నడిపించడమో లేక పాతాళంలోకి పడేయడమో చేస్తుంటాయి.
అంటే, ప్రజలనుంచి పాలకులవరకూ 'మానసిక ఆరోగ్యం' అనేది ఎంత పాజిటివ్‌గా, శక్తిమంతంగా ఉంటే ఆ దేశాలు అంత ఉత్తమ ప్రగతిని సాధిస్తాయి. 'మానసిక ఆరోగ్యం' ఎంత బాగుంటే అంత మంచి నిర్ణయాలు తీసుకుని, అమలు చేసి, ఉత్తమ ఫలితాలు సాధించడం జరుగుతుంది. ఇది తిరుగులేని సత్యం. అయితే కాలానుగుణంగా చోటుచేసుకున్న సామాజిక మార్పులు ప్రపంచ 'మానసిక ఆరోగ్య' గతిని మార్చేశాయి.
'మానసిక ఆరోగ్య' పరిస్థితిపై జరిగిన తాజా అంతర్జాతీయ సర్వేలు, పరిశోధనలు ఏమంటున్నాయంటే.. ప్రపంచ జనాభాలో సుమారు 15% నుండి 18% మంది (సుమారు 100 కోట్ల జనం) ఏదో ఒక మానసిక ఆరోగ్య సమస్యతో జీవిస్తున్నారు. మానసిక రుగ్మతలలో డిప్రెషన్ (కుంగుబాటు), యాంగ్జయిటీ (అతి ఆందోళన) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. వివిధ దేశాల్లో నిర్వహించిన సర్వేల ప్రకారం 18 నుండి 35 ఏళ్ల వయస్సు యువతలో మానసిక ఆరోగ్య సూచీలు వేగంగా దిగజారుతున్నాయి. యువతరమే కాదు బాలల్లోనూ మానసిక ఆరోగ్య ప్రమాణాలు ఆందోళనకరంగానే ఉన్నాయి.
భారత్ పరిస్థితిని గమనిస్తే బడి పిల్లలలో సుమారు 29% నుంచి 35% మంది నిరంతర ఆందోళన, భయం లేదా నిరాశతో బాధపడుతున్నారు. 80% కంటే ఎక్కువమంది విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గుర వుతున్నారు. యునిసెఫ్, ఎన్‌సిఇఆర్‌టీతో పాటు పలు జాతీయ సర్వేల అధ్యయనాలు వెల్లడించిన తాజా గణాంకాలు ఇవి. నేటి సోషల్ మీడియా, ఎఐ యుగంలో ఈ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చి, మరిన్ని ఇబ్బందులు తోడై మానసిక ఆరోగ్య పరిధిలోకి బాలల్ని కూడా లాక్కొచ్చాయి. ఆకర్షణలు, ప్రలోభాల వైపు అతిగా మనసును మళ్ళించి ఆందోళనపాలవుతున్నారు. దాంతో అన్ని వర్గాలవారిలోనూ మానసిక ఆరోగ్యం దెబ్బ తింటున్నదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నోమోఫోబియా
అతిగా సాగుతున్న మొబైల్ ఆధారిత కార్యకలాపాల వల్ల ప్రజల్లో 'నోమోఫోబియా'కు దారి తీస్తోంది. కొద్దిసేపు మొబైల్ కనిపించకపోతే, శరీరంలోని ఒక అంగం పోయినంతగా తీవ్ర ఆందోళనకు గురై మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకుంటున్నవారు కోట్లాదిగా ఉన్నారు. ఫోన్ కనిపించనప్పుడు లేదా బ్యాటరీ అయిపోయినప్పుడు గుండె వేగం పెరగడం, చెమటలు పట్టడం, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న వారిలో సుమారు 60% నుండి 70% మంది, తక్కువ లేదా తీవ్రస్థాయిలో నోమోఫోబియాతో బాధపడుతున్నారు.
భారత్‌లో చేసిన పలు అధ్యయనాల ప్రకారం, విశ్వవిద్యాలయ విద్యార్థులు, యువతలో దాదాపు 70% నుండి 80% మంది ఫోన్ అందుబాటులో లేనప్పుడు తీవ్ర ఆందోళన పాలవుతున్నారు. ఈ ఒక్క కారణంతో చుట్టుపక్కల వారి పట్ల కోపం, అసహనం వెల్లడై ముఖ్యమైన పనులపై ప్రభావం పడి ఫలితాలు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేడు పెద్ద సంఖ్యలో డిజిటల్ డిటాక్స్ క్లినిక్స్ రంగంలోకి దిగాయి.
సిల్వర్ సునామీ
మరోవైపు వృద్ధులు కూడా తీవ్రస్థాయిలో 'డిజిటల్ బానిసలు' అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య, సామాజిక విశ్లేషకులు ఈ పరిణామాన్ని "సిల్వర్ సునామీ" లేదా "సిల్వర్ నోమోఫోబియా" అని పిలుస్తున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్, గ్లోబల్ సర్వేల ప్రకారం, 65 ఏళ్లు పైబడిన వారిలో స్మార్ట్‌ఫోన్ వాడకం గత పదేళ్లలో 300% కంటే ఎక్కువ పెరిగింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు రోజుకు సగటున 4 నుండి 6 గంటల సమయం స్మార్ట్ఫోన్లు, టాబ్‌లు లేదా టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్నారు. భారత నగరాల్లోని వృద్ధులలో 60% కంటే ఎక్కువ మంది నిద్రలేవగానే వాట్సాప్ లేదా యూట్యూబ్ చెక్ చేయడం అలవాటుగా మారిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఉద్యోగాలు, చదువుల వల్ల పిల్లలు దూరంగా ఉండటం, భాగస్వామిని కోల్పోవడం వల్ల వచ్చే ఏకాంతాన్ని పోగొట్టుకోవడానికి వృద్ధులు స్మార్ట్ ఫోన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వచ్చే సంచలనాత్మక లేదా తప్పుడు ఆరోగ్య సమాచారాన్ని చూసి వృద్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో స్క్రీన్ వెలుగు వల్ల మెలటోనిన్ ఉత్పత్తి తగ్గి వీరికి నిద్ర పట్టడంలేదు. ఆన్‌లైన్ మోసగాళ్లకు ఎక్కువగా వృద్ధులే బలై ఆర్థికంగా, మానసికంగా దెబ్బతింటున్నారు.
పెరుగుతున్న డిజిటల్ డిటాక్స్ క్లినిక్స్
రీల్స్, షార్ట్స్ అని ఐదారు అంగుళాల మొబైల్‌నే ప్రపంచంగా చేసుకుని రోజుల తరబడి అందులోనే గడిపేస్తున్నారు. దీంతో నిద్రలేమి, ఆకలి అట్నుంచి తీవ్ర అనారోగ్యం వైపు వెళుతున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్య ప్రమాణాలు పడిపోతున్న తరుణంలో స్మార్ట్‌ఫోన్ చదువులకు వెంటనే ముగింపు పలుకుదామని ప్రపంచానికి యునెస్కో పిలుపు నిచ్చింది. వీటివల్ల చదువులే గాక సంస్కారం, వ్యక్తిత్వం కూడా దెబ్బతింటున్నాయని యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది.
‘విద్యారంగంలో సాంకేతికత -2023’ పేరుతో విడుదలైన నివేదికలో పై విషయాలు పేర్కొంది. యునెస్కో చేసిన సూచనల అమలుకు ఫ్రాన్స్, ఫిన్లాండ్, నెదర్లాండ్ దేశాలు అంగీకరించాయి. బాలలు, యువతరాన్ని కాపాడుకోవడానికి డిజిటల్ డిటాక్స్ క్లినిక్స్ పెరుగుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా, జపాన్, యుకె, కెనడా, జర్మనీ, స్పెయిన్ తదితర దేశాల్లో ఈ క్లినిక్స్ కిటకిటలాడుతున్నాయి. బెంగళూరులోని మానసిక ఆరోగ్య సంస్థ నిమ్హాన్స్‌లో ‘SHUT’ పేరిట ఇలాంటి క్లినిక్ నడుస్తోంది.
గుళ్ళపూడి శ్రీనివాస కుమార్
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ [email protected]
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
