తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ అమావాస్య రోజు మొదలై తొమ్మిది రోజులపాటు మహిళలంతా ఐకమత్యంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందంగా, వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ పుట్టుకకు అనేక రకాల కారణాలు ఉన్నాయని చరిత్ర చెబుతున్నది.
ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బాగా కరువు వచ్చి ప్రజలు దీర్ఘకాల, భయంకరమైన వ్యాధులకు తట్టుకోలేక చనిపోతుంటే ప్రకృతిలోని రకరకాల రంగు రంగుల పూలను పేర్చి.. బతికించమని దేవతను పూజించారని ఆ దేవతయే ‘బతుకమ్మ’గా తెలంగాణలో వెలసినట్టుగా ఒక కథనం ప్రచారంలో ఉంది.
శ్రీ మహా విష్ణువు మారువేషంలో చక్రాంకుడను పేరిట ధరచోళ రాజు ధర్మాంగుని ఇంటికి వచ్చి బతుకమ్మను చూసి వివాహమాడాడని ఆనాటి కథల్లో చెప్పడమైనది. ఆ బతుకమ్మనే లక్ష్మీదేవిగా పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు రకరకాల పూలతో అంగరంగ వైభవంగా మహిళలంతా ఒకచోట చేరి జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ.
బతుకమ్మ చుట్టూ మహిళల ఆటపాటలు
తంగేడు, గునుగు, రుద్రాక్ష, కట్ల, బంతి, చామంతి, గుమ్మడి, గోరంట, జాజి, పారిజాత, గన్నేరు, సీతజడ, కలువ, మందార వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను తయారు చేసి బతుకమ్మ మధ్యలో తమలపాకుపై పసుపు గౌరమ్మను పెట్టి పసుపు, కుంకుమ, గంధం, రోజుకో రకం నైవేద్యం పెట్టి పూజిస్తారు. తొమ్మిదవ రోజు సాయంత్రం ఊళ్ళో ఉన్న కాలువ, వాగు, చెరువుగట్టునకు బతుకమ్మను తీసుకువెళ్లి ఆటలు ఆడి, పాటలు పాడి, పసుపు కుంకుమలు చల్లి, ఆరగించుము గౌరి అమృతన్నంబు అంటూ నైవేద్యం సమర్పిస్తారు.
పువ్వుల్లో పుట్టిన గౌరమ్మ..
ఇసుకలో పుట్టిన గౌరమ్మ, పసుపులో పుట్టిన గౌరమ్మ.. కుంకుమలో పుట్టిన గౌరమ్మ.. అక్షతల్లో పుట్టిన గౌరమ్మ,. పువ్వుల్లో పుట్టిన గౌరమ్మ. అంటూ పాటలుపాడి, హిమవంతునింట్లో పుట్టి, పెరిగి విదియ అట్లతదియనాడు కాంతలందరూ గూడి వరుసతో సద్దులు పెట్టి ఆ శివునికి అప్పగించి మాయమ్మ గౌరీదేవీ పోయిరావమ్మా.. మాతల్లి లక్ష్మీదేవీ మళ్లీ రావమ్మా.. ఇలా తెలంగాణ మహిళలు ఎంతో ఆసక్తిగా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ.
ఎర్రా ప్రసూన
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
