పూలనే దేవుడిగా పూజించే పుణ్యభూమి మనది. ప్రకృతికే పట్టాభిషేకం చేసే పండుగ మనది. తెలంగాణ గుండెల్లో వికసించిన ఆత్మగౌరవ ప్రతీక మన బతుకమ్మ. మన ఆడపడుచుల మురిపాల వేడుక. ‘బతుకమ్మ’.. ఈ అక్షరాల్లోనే ఒక ప్రాణం ఉంది. తెలంగాణ పల్లె గాలిలో వీచే మట్టి వాసన ఉంది. పూలను పూజించే అద్భుతమైన సంస్కృతికి, ప్రకృతితో మనిషికి ఉన్న పేగుబంధానికి సజీవ సాక్ష్యం ఈ పండుగ.
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ‘ప్రజా ప్రభుత్వం’ ఆధ్వర్యంలో ఈ పూల పండుగ ఇప్పుడు సరికొత్త శోభను సంతరించుకుంది. గతేడాది మన తెలంగాణ పూల సింగిడి బతుకమ్మ ఏకంగా రెండు 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్' సాధించింది. రాజకీయాలకు అతీతంగా, అచ్చమైన సాంస్కృతిక వైభవంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఘనంగా జరుపుకోవడం విశేషం.
వాగులు, వంకలు, పూలతో పులకించగా.. నీటి తల్లికి ఔషధాల సిరులు అందించగా, పర్యావరణానికి ప్రాణం పోసే పచ్చని పండుగ.. పల్లె చెరువులను శుద్ధి చేసే శాస్త్రీయ వేడుక.. మన బతుకమ్మ. ప్రపంచంలో ఎక్కడైనా దేవుడికి పూలతో పూజ చేస్తారు. కానీ, పూలనే దేవుడిగా పూజించే ఏకైక పండుగ బతుకమ్మ. ఇది కేవలం భక్తి కాదు. ప్రకృతిని బతికించుకునే అద్భుతమైన శాస్త్రీయ ప్రక్రియ. వర్షాకాలం వెళ్లిపోతూ, చలికాలం వస్తున్నవేళ వాగులు, చెరువులు కళకళలాడుతాయి. ఆ సమయంలో విరిసే అడవి పూలను తెచ్చి, అందంగా పేర్చి, తొమ్మిది రోజులు కొలిచి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పూలలోని ఔషధ గుణాలు నీటిలోని మలినాలను తొలగించి, క్రిమిసంహారకంగా పనిచేస్తాయి. ప్రకృతిని ప్రేమించడం బతుకమ్మ మనకు నేర్పుతుంది.
ఆడపడుచుల ఆత్మగౌరవ కిరీటం
ఆడపడుచులు పుట్టింటికి చేరుకుని మురిసిపోయే పండుగ బతుకమ్మ. ఉదయాన్నే మగవారు పచ్చని అడవుల్లోంచి రంగుల పూలు తెస్తుంటే, మహిళలు ఆ పూలను కళాత్మకంగా పేర్చుతూ తమలోని సృజనాత్మకతకు ప్రాణం పోస్తారు. సాయంవేళ, తాము పేర్చిన బతుకమ్మల చుట్టూ వలయాకారంలో తిరుగుతూ.. చప్పట్లు కొడుతూ పాడే పాటలు.. తెలంగాణ చరిత్రను, పురాణాలను కళ్లకు కడతాయి. ఇలా ఆడటం వల్ల మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు సైతం వివరిస్తారు.
తొమ్మిది రోజుల ‘బతుకమ్మ’ సంబురాలు
తొమ్మిది రోజుల పండుగలో దాగిన తొమ్మిది అంచెలు. ప్రతిరోజూ పల్లెల్లో విరిసే ఆనందపు పువ్వులు. ఒక్కో నైవేద్యంలో దాగున్న పల్లెటూరి రుచులు.. ఇదే మన బతుకమ్మ. మహాలయ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులపాటు సాగే ఒక మహా క్రతువు. ఎంతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మను జరుపుకుంటారు. ఒక్కో రోజుకు ఒక్కో పేరు, ఆ రోజు పెట్టే నైవేద్యానికి కూడా ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ.
చివరి రోజున సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. దుర్గాష్టమి రోజున అత్యంత వైభవంగా జరుపుకునే అతిపెద్ద పండుగ ఇదే. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారు చేసి బతుకమ్మతోపాటు చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం అనంతరం బంధువులతో, ఇరుగుపొరుగు వారితో పంచుకుని తినడం దీని ప్రత్యేకత.
ప్రజా ప్రభుత్వంలో బతుకమ్మకు పెద్దపీట
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం బతుకమ్మ పండుగను స్వచ్ఛమైన ‘ప్రజా పండుగ’గా మార్చింది. గతంలోలాగా పండుగను రాజకీయ ప్రచారానికి వాడుకోకుండా.. ఆడపడుచుల ఆత్మగౌరవ వేదికగా తీర్చిదిద్దింది. ‘మన సంస్కృతి - మన గర్వకారణం’ అనే నినాదంతో మౌలిక వసతుల కల్పనకు నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తోంది.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు కృషితో బతుకమ్మ విశ్వవ్యాప్తమైంది. పర్యాటక శాఖ రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీలు, హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, శిల్పారామంలో నిర్వహిస్తున్న ‘బతుకమ్మ ఫెస్టివల్’ ఈవెంట్లు విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి.ఈ బతుకమ్మ వెలుగులు ప్రతి ఇంటా సిరిసంపదలు నింపాలని ఆశిద్దాం.
ఇందిరా శోభన్, కాంగ్రెస్ సీనియర్ నేత
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
