- సీఎం టూర్‌ను అడ్డుకోవడం
- తెలంగాణ ప్రజలను అవమానించడమే
- మోదీ అనధికారికంగా పాకిస్తాన్ వెళితే ఎందుకు మాట్లాడలేదు?
- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- సెమీ కండక్టర్ పరిశ్రమను గుజరాత్‌కు ఎందుకు తరలించారు?
- తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి: ఎంపీ చామల
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం అంటే తెలంగాణ ముఖ్యమంత్రిని, ఇక్కడి ప్రజలను అవమానించడమేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచాలనే ఉద్దేశంతో అమెరికా టూర్ ఖరారు చేసుకుంటే.. బీజేపీ నేతలు కుట్రతోనే అడ్డుకున్నారని విమర్శించారు.
సీఎం అమెరికా టూర్‌పై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, దానికి ముందు మోదీ ప్రధానిగా అనధికారికంగా పాకిస్తాన్ వెళ్లిన దానిపై ఎందుకు స్పందించరని ఫైర్ అయ్యారు. మోదీ ప్రధానిగా అమెరికా నుంచి నేరుగా పాకిస్తాన్ వెళ్లి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారని, దీనిపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఆగస్టు సంక్షోభం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి రాదని, ఆ సంక్షోభం రావడానికి ఇక్కడ టీడీపీ ప్రభుత్వం లేదన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అందుకే ఇక్కడి ప్రభుత్వానికి ఏ భయం ఉండదన్నారు. పైగా ఇక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారని, పూర్తికాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, వచ్చే ఐదేండ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందన్నారు.
