కొండాను తప్పించాలె.. ప్లానింగ్ బోర్డు నుంచి చిన్నారెడ్డిని తొలగించాలి

కొండాను తప్పించాలె.. ప్లానింగ్ బోర్డు నుంచి చిన్నారెడ్డిని తొలగించాలి
  • వీళ్లిద్దరూ పార్టీలో కొనసాగొచ్చు.. పదవులు వద్దు
  • హైకమాండ్‌‌‌‌‌‌‌‌కు పీసీసీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు
  • మంత్రిగా ఉండి కూతురు వ్యాఖ్యలు ఖండించలే
  • సురేఖ తీరుతో పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం
  • సుస్మిత కామెంట్స్, కొండా వరుస వివాదాల ప్రస్తావన
  • పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్ ద్వారా ఏఐసీసీకి రిపోర్టు
  • చర్యలు తీసుకోకుంటే పార్టీకి నష్టమన్న మల్లు రవి

హైదరాబాద్, వెలుగు:  కొండా సురేఖను మంత్రి పదవి నుంచి, చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తక్షణమే  తప్పించాలని, పార్టీలో మాత్రం కొనసాగించవచ్చని  హైకమాండ్‌‌‌‌‌‌‌‌కు పీసీసీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

‘‘మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించాయి. అదే సమయంలో ప్రతిపక్షాలకు  ఆయుధంగా మారాయి.  పైగా కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మంత్రి సురేఖ ఇచ్చిన సమాధానంలో ఎక్కడా తన కూతురు చేసిన విమర్శలను ఖండించడంగానీ, వ్యతిరేకించడం గానీ చేయలేదని పేర్కొన్నట్టు తెలిసింది.   

సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌సహా పార్టీ నేతలపై తన కుమార్తె  సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి  సురేఖ ఎలాంటి పశ్చాత్తాపం ప్రకటించలేదు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తననెలా బాధ్యురాలిని చేస్తారని, ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమంటూ వితండవాదానికి దిగారు. పైగా తనకు నోటీసు ఇవ్వడమే సరికాదన్నట్టు, నోటీసునే వెనక్కి తీసుకోవాలన్న వాదన వినిపించారు. ఇది సుస్మిత వ్యాఖ్యలను సురేఖ సమర్థించడమే అవుతుంది’’ అని కమిటీ అభిప్రాయపడినట్టు సమాచారం.


కొండాపై చర్యల విషయంలో కేవలం సుస్మిత వ్యాఖ్యల వరకే పరిమితం కావద్దని,  ఆమె ఓఎస్డీ సుమంత్ బ్లాక్​మెయిలింగ్​వ్యవహారం,  ప్రముఖ సినీ నటుడిపై విచక్షణ మరిచి చేసిన ఆరోపణలు, మేడారం కాంట్రాక్టుల కోసం బహిరంగంగా చేసిన గొడవ.. తదితర వరుస వివాదాలను పరిగణలోకి తీసుకోవాలని నివేదికలో హైకమాండ్‌‌కు సూచించినట్టు తెలిసింది.  

ఈ మేరకు మంగళవారం సాయంత్రం పీసీసీ చీఫ్‌‌ మహేశ్ గౌడ్‌‌కు కమిటీ చైర్మన్ మల్లు రవి  సమగ్ర నివేదిక అందించారు. ఆ వెంటనే రిపోర్ట్‌‌ను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్‌‌కు, ఏఐసీసీకి పంపించారు. దీంతో ఈ నివేదికలో ఏముంది? కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకోబుతున్నారు? అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా అటు కాంగ్రెస్ కేడర్‌‌‌‌లో, ఇటు సామాన్య ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది. 

సుస్మిత వ్యాఖ్యల నుంచి కొండా వివరణ దాకా.. 

పరకాల నియోజకవర్గంలోని గీసుగొండలో  ఈ నెల19న మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె కూతురు సుస్మిత  సీఎం రేవంత్​రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగా పెనుదుమారం రేపింది.

 ప్రతిపక్షాలు తమ విమర్శలకు పదునుపెట్టాయి. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు  పార్టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్​ హోదాలో మల్లు రవి.. మంత్రి కొండా సురేఖకు షోకాజ్​నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ నెల 20న మంత్రి సురేఖ తన వివరణను మల్లు రవికి అందించారు. 

తన కూతురి వ్యాఖ్యలకు తననెలా బాధ్యురాలిని చేస్తారు? అని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని  మంత్రి  సురేఖ పేర్కొన్నారు. ఆమె ఎక్కడా కూతురు వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టుగానీ, వ్యతిరేకిస్తున్నట్టుగానీ పేర్కొనలేదు. దీంతో సీఎంకు మద్దతుగా పలువురు విప్‌‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండురోజులు వరుసగా ప్రెస్‌‌మీట్లు​పెట్టి కొండా సురేఖ వైఖరిని తప్పుపట్టారు.

 మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సీఎంకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్​చేశారు. ఈ ఎపిసోడ్​ తర్వాత  ఈ నెల 22న మంత్రి సురేఖ మరోసారి క్రమశిక్షణా కమిటీ చైర్మన్​ మల్లు రవికి లేఖ రాశారు. 

తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని కొందరు కాంగ్రెస్​నాయకులు బహిరంగంగా, అవమానకర రీతిలో మాట్లాడుతున్నారని, వీరి వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులను గుర్తించి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. ఈ రెండుసార్లూ ఆమె ఇచ్చిన వివరణను క్రమశిక్షణా కమిటీ తప్పుపట్టినట్టు తెలిసింది.  సుస్మిత వ్యాఖ్యలను సమర్థించినట్టుగానే సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని అభిప్రాయపడింది. 

లేఖలో ఉన్న వివరాలు ఇవీ!

 మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్​రెడ్డి, ఇతర నేతలపై చేసిన విమర్శలు, ఆరోపణలు పార్టీని, ప్రభుత్వాన్ని అవమానించేలా ఉన్నాయి. కాంగ్రెస్‌‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రతిపక్షాలకు  అవకాశమిచ్చాయి.

క్రమ శిక్షణా కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీస్‌‌కు మంత్రి ఇచ్చిన సమాధానంలో ఎక్కడా తన కూతురు కామెంట్లను ఖండించడంగానీ, వ్యతిరేకించడం కానీ చేయలేదు. కూతురు వ్యాఖ్యలు తన  వ్యక్తిగతమని, వాటితో తనకు సంబంధం లేదనే ధోరణిలోనే  కొండా వివరణ ఉంది. పైగా తనకు నోటీసు ఇవ్వడమే సరికాదన్నట్టుగా, నోటీసును వెనక్కి తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.

నోటీసు ఇచ్చిన ఉద్దేశాన్ని వదిలి ఆమె స్పందించిన తీరే సమస్యాత్మకంగా ఉందని కమిటీ భావిస్తున్నది. మంత్రిగా ఉన్న ఆమెకు సీఎంపై కామెంట్లను ఖండించే అవకాశం ఇచ్చినా.. ఆమె అందుకు సిద్ధంగా లేరు.

కూతురు వ్యాఖ్యలపై ఒక్క మాట మాట్లాడకుండా సహజన్యాయం పేరుతో ఆత్మరక్షణ ధోరణికే సురేఖ పరిమితమయ్యారు.

కొండా సురేఖ తీరు.. పరోక్షంగా కూతురు ప్రవర్తనను సమర్థిస్తున్నట్టుగా ఉంది.  బాధ్యత కలిగిన మంత్రిగా ఉంటూ పార్టీతో తనకేం సంబంధం లేనట్టుగా ఉన్న ఆమెకు సహజన్యాయ సూత్రాలు వర్తించవు.  కొండా ఓఎస్డీ సుమంత్ చేసిన హత్యాయత్నం కేసులో కేసు నమోదుకాకుండా మంత్రి కొండా సురేఖ పోలీసులపై ఒత్తిడిచేశారు.

 పరిశ్రమల యజమానులను  బెదిరిస్తున్నందుకు సుమంత్‌‌పై కేసు నమోదైన సందర్భంలో పోలీసులు వెళితే మంత్రి కూతురు వారిని అసభ్యంగా తిట్టడంతోపాటు తన కారులోనే తప్పించారు. 

మేడారం జాతర సమయంలో తన అనుచరులకు పనులు ఇవ్వాలని మంత్రి ఒత్తిడితేవడంతో పాటు కాంట్రాక్టర్లను కమీషన్ల కోసం డిమాండ్ చేశారు. గిరిజన వేడుకకు సంబంధించిన పనుల్లో ఒత్తిడికి ఒప్పుకోలేదని కేబినెట్ మంత్రి అయిన సీతక్కను దూషించారు.

సినీ నటుడు నాగార్జున మీద అసభ్య వ్యాఖ్యలు చేసి కేసులో క్రిమినల్ విచారణను ఎదుర్కొని, తర్వాత పబ్లిక్‌‌గా క్షమాపణ చెప్పి బయటపడ్డారు. 

 మంత్రి ఓఎస్డీ వ్యవహారం, మేడారం జాతర సమయంలో మంత్రి ప్రవర్తన, సినీ నటుడిపై అసభ్య వ్యాఖ్యలు, కూతురు కామెంట్లు.. ఇలా గత సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటే మంత్రి కొండా సురేఖ, ఆమె కుటుంబ ప్రవర్తన పార్టీ మీద ప్రభావం చూపించేలా ఉంది. పార్టీని బలహీనంచేసే ప్రమాదం ఉంది.


 పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని  కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని సిఫార్సు చేస్తున్నాం. పార్టీ క్రమశిక్షణా విషయంలో, ఏకపక్షంగా చేసే బహిరంగ వ్యాఖ్యల విషయంలో ఈ నిర్ణయం పార్టీలోని ప్రతి ఒక్కరికీ గట్టి సందేశాన్ని ఇచ్చినట్టవుతుంది.

కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాల మేరకే  చర్యలు: మల్లు రవి

 మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్  చిన్నారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనని కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. కమిటీ నివేదికను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌కు ఇచ్చిన అనంతరం ఆయన గాంధీ భవన్‌‌లో మీడియా  సమావేశంలో మాట్లాడారు. 

‘‘కాంగ్రెస్ కమిటీలో క్రమశిక్షణ ప్రధానమైంది. క్రమశిక్షణపైనే పార్టీ గౌరవం ఆధారపడి ఉంటుంది. 
పార్టీపై గౌరవం ఉంటేనే మళ్లీ అధికారంలోకి వస్తాం. పార్టీపై వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందే’’ అని  వ్యాఖ్యానించారు.

 కొండా సురేఖ, చిన్నారెడ్డిపై పూర్తి అంశాలను నివేదికలో ఇచ్చామని,  మీడియాలో వచ్చిన కథనాలను చూసి ఒక అంచనాకు వచ్చామని, గత విషయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఆయన వివరించారు. ఈ నివేదికను రాష్ట్ర ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్‌‌కు పంపించామని,  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌‌కు కూడా పంపిస్తామన్నారు. కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాల మేరకే వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.‘‘ఈ నిర్ణయంతో  నాయకులు, కేడర్‌‌‌‌కు  ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాం’’ అని మల్లురవి స్పష్టం చేశారు.