నేపాల్ వరదలు : మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు.. 100 మందికి పైగా భారతీయులు

నేపాల్ వరదలు : మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు.. 100 మందికి పైగా భారతీయులు

నేపాల్ దేశాన్ని ఆకస్మిక వరదలు అల్లకల్లోలం చేశాయి. నేపాల్.. చైనా దేశాల సరిహద్దుల్లో.. 2026, ఆగస్ట్ 26వ తేదీ ఉదయం కుండపోత వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ వరద ఏ స్థాయిలో ఉంది అంటే.. చెట్లు, రోడ్లు, ఇళ్లు, వంతెలను నామరూపాల్లేకుండా చేసింది. రసువాగఢి అనే గ్రామంతోపాటు ఆరు గ్రామాలను తుడిచిపెట్టేసింది. ఆయా గ్రామాల్లో నివాసం ఉంటున్న వేల మంది గల్లంతు అయ్యారు. వాళ్ల ఆచూకీ లేదు. ఇదే సమయంలో మానస సరోవర్.. కైలాస్ యాత్రకు వెళ్లిన 400 మంది పర్యాటకులు గల్లంతు అయ్యారు అన్న సమాచారంతో.. ఆయా దేశాల్లోనూ ఆందోళన నెలకొంది.

చైనాలోని టిబెట్ లో ఉన్న కైలాష్ మానససరోవర్ యాత్రకు వెళ్తున్న దాదాపు 400 మంది యాత్రికులు గల్లంతయ్యారు. వరదల కారణంగా రసువాఘడి సహా చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. నేపాల్-చైనా సరిహద్దు వెంట ఉన్న రోడ్లు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బుధవారం 93 మంది నేపాలీలతో సహా 390 మంది యాత్రికులు సరిహద్దు దాటారని కాఠ్మండుకు చెందిన టచ్ కైలాష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది తెలిపారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి యాత్రికులను కాంటాక్ట్ అవ్వలేకపోతున్నామని అంటున్నారు అధికారులు.గల్లంతైన యాత్రికుల్లో వివిధ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వెళ్ళినవారు ఉన్నారని అంటున్నారు. సమ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ ద్వారా 71 మంది, లీఫ్ హాలిడేస్ ద్వారా 55, కాఠ్మండు హాలిడేస్‌ ద్వారా 17, కైలాష్ జర్నీ ద్వారా 31, ఎక్స్‌ప్లోర్ వెకేషన్‌ ద్వారా 7, ట్రెక్కర్స్ సొసైటీ ద్వారా 92, రిచా టూర్స్‌ ద్వారా 12, ఫిష్‌టెయిల్ టూర్ అండ్ ట్రావెల్స్‌ ద్వారా 27, హిమాలయన్ గ్లేసియర్‌ ద్వారా 62 మంది ఆల్పైన్ ఎకో ట్రెక్‌ ద్వారా 16 మంది యాత్రికులు వెళ్లారని తెలిపారు అధికారులు.

ALSO READ : నేపాల్లో వరదలు.. ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి!

యాత్రికులతో సంప్రదించి, వారి పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నేపాల్ ట్రెకింగ్ ఏజెన్సీల సంఘం అధ్యక్షుడు సాగర్ పాండే తెలిపారు.బుధవారం తెల్లవారుజామున రసువాలో సంభవించిన ఆకస్మిక వరద, రసువాగధి ప్రాంతంలోని నివాస ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపడంతో పాటు, టిబెట్‌కు వెళ్లే కీలక సరిహద్దు మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగించిందని తెలిపారు అధికారులు.