రూ. వెయ్యి కోట్లు అప్పు చేస్తున్న డీమార్ట్.. 7 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఎందుకంటే?

రూ. వెయ్యి కోట్లు అప్పు చేస్తున్న డీమార్ట్.. 7 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఎందుకంటే?

దేశవ్యాప్తంగా మిడిల్ క్లాస్ నుంచి సంపన్న వర్గాలు సైతం కిరాణా సరుకుల కోసం షాపింగ్ అనగానే గుర్తుకొచ్చే పేరు డీమార్ట్. ప్రతి వస్తువుపై మార్కెట్లో ఇతర వ్యాపార సంస్థల కంటే తక్కువ రేట్లకు, మంచి డిస్కౌంట్లతో అందుబాటులో ఉండటమే డీమార్ట్ ఫేమస్ అయ్యింది. ఈ నెలలో తన డీమార్ట్ రెడీ స్టోర్లను క్లోజ్ చేసిన కంపెనీ తాజాగా అప్పు కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత తొలిసారిగా రిటైల్ దిగ్గజం అప్పుల కోసం తిరిగి ప్రయత్నాలు చేయటంతో మార్కెట్లో అందరి నోట రాధాకిషన్ దమానీ కంపెనీపై ఫోకస్ పెరిగింది. 

ప్రముఖ రిటైల్ బ్రాండ్ D-Mart మాతృసంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ కార్పొరేట్ డెట్ మార్కెట్ ద్వారా నిధులు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. రూ.1,000 కోట్ల భారీ మొత్తాన్ని సమీక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కార్పొరేట్ బాండ్ల జారీకి సంబంధించి మర్చంట్ బ్యాంకర్లను కంపెనీ అప్రమత్తం చేసినట్లు సమాచారం.

కంపెనీ 3 ఏళ్ల కాలం లోపు ఉండే షార్ట్ టర్మ్ బాండ్లను జారీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు ఈ డీల్ పట్ల ప్రత్యేక ఆసక్తి చూపుతున్నాయి. సెప్టెంబర్ మొదటి అర్ధభాగంలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. డీమార్ట్ చివరిసారిగా అక్టోబర్ 2019లో బాండ్ల ద్వారా నిధులు సమీకరించింది. అప్పట్లో 13 నెలల కాలపరిమితితో బాండ్లు జారీ చేసినప్పటికీ.. కేవలం 6 నెలలకే వాటిని తిరిగి చెల్లించేసింది.

ALSO READ : కోటి జీతం ఉన్నా అమెరికా వేస్ట్.. 

అవెన్యూ సూపర్‌మార్ట్స్ జారీ చేయబోయే ఈ బాండ్లకు ప్రముఖ రేటింగ్ సంస్థ ICRA అత్యుత్తమంగా AAA రేటింగ్‌ను కేటాయించింది. దేశంలోనే అతిపెద్ద ఆహార, కిరాణా రిటైలర్‌గా సంస్థకున్న బలమైన మార్కెట్ స్థానాన్ని ఈ రేటింగ్ పరిగణలోకి తీసుకుంది. పటిష్టమైన సప్లై చైన్ నెట్‌వర్క్, అద్భుతమైన ప్రొక్యూర్‌మెంట్ సామర్థ్యాలు, పోటీ ధరల విధానం వల్ల స్టోర్లకు వినియోగదారుల తాకిడి పెరిగి..  స్థిరమైన మార్జిన్లు వస్తున్నాయని ఐసీఆర్‌ఏ పేర్కొంది.

మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఆసక్తి..
డీమార్ట్ లాంటి బలమైన ఫండమెంటల్స్ ఉన్న సంస్థ మార్కెట్లోకి చాలా అరుదుగా బాండ్లతో వస్తుండటంతో మ్యూచువల్ ఫండ్ సంస్థల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ అరుదైన సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నిధుల సమీకరణ వార్తలపై కంపెనీ నుంచి అధికారికంగా స్పందన కోరినప్పటికీ.. డీమార్ట్ యాజమాన్యం స్పందన లేదు. రిటైల్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న డిమార్ట్ మరోసారి రుణ మార్కెట్లోకి అడుగుపెడుతుండటం ఇన్వెస్టర్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.