అల్యూమినియం ఉత్పత్తి రంగంలోకి అంబానీ.. అదానీకి ధీటుగా రిలయన్స్ మాస్టర్ ప్లాన్!

అల్యూమినియం ఉత్పత్తి రంగంలోకి అంబానీ.. అదానీకి ధీటుగా రిలయన్స్ మాస్టర్ ప్లాన్!

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు పూర్తిగా మెటల్స్ వ్యాపారం వైపు అడుగులు వేస్తోంది. రిలయన్స్ సంస్థ త్వరలోనే అల్యూమినియం ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే.. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో ఇది మరో మైలురాయిగా నిలవనుంది. అయితే ఈ ప్రణాళికలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయాలు తీసుకోలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కోల్ గ్యాసిఫికేషన్ - మెటల్స్ తయారీకి లింక్:
ఈ సరికొత్త సాహసం వెనుక రిలయన్స్ వ్యూహాత్మక ప్లానింగ్ దాగి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ చేపడుతున్న భారీ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులతో అల్యూమినియం ఉత్పత్తిని అనుసంధానించాలని కంపెనీ భావిస్తోంది. బొగ్గును సింథసిస్ గ్యాస్ గా మార్చే ఈ విధానం ద్వారా పవర్ జనరేషన్, పారిశ్రామిక ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. ఈ గ్యాసిఫికేషన్ ద్వారా లభించే ఇంధనాన్ని అత్యధిక విద్యుత్ అవసరమయ్యే అల్యూమినియం, అల్యూమినా తయారీకి ఉపయోగించుకోవచ్చనేది రిలయన్స్ ఆలోచన.

ఒడిశా బాక్సైట్ బ్లాక్‌పై రిలయన్స్ కన్ను..
అల్యూమినియం ఉత్పత్తికి ముడిసరుకైన బాక్సైట్ కోసం రిలయన్స్ ఇప్పటికే పావులు కదుపుతోంది. ఒడిశాలోని కార్లాపత్ బాక్సైట్ బ్లాక్ కోసం కంపెనీ టెండర్ పత్రాలను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు 3వేల 100 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ బ్లాక్‌లో 200 మిలియన్ టన్నులకు పైగా బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు అంచనా. అయితే ఈ బ్లాక్ కోసం జరిగిన వేలంలో వేదాంత గ్రూప్‌నకు చెందిన బాల్కో సంస్థ 175% ఆక్షన్ ప్రీమియంతో ముందంజలో నిలిచింది. అయినప్పటికీ రిలయన్స్ ఈ రంగంపై తన ప్రయత్నాలను ఆపట్లేదు.

అదానీ గ్రూప్ ఎందుకు రంగంలోకి దిగింది?
మరోవైపు అదానీ గ్రూప్ కూడా అల్యూమినియం రంగంలోకి భారీ పెట్టుబడులతో అడుగుపెడుతుండటం గమనార్హం. యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీతో కలిసి అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఒడిశాలో ఏటా 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కూడిన అల్యూమినియం ప్రాజెక్ట్ కోసం సుమారు రూ.95 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు జూలైలో ప్రకటించింది. భారతదేశంలో పెరుగుతున్న మెటల్స్ డిమాండ్, పారిశ్రామిక వృద్ధిని దృష్టిలో ఉంచుకునే అదానీ గ్రూప్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

రిలయన్స్ వర్సెస్ అదానీ: 
ఇప్పటికే భారత్‌లో వేదాంత అల్యూమినియం 2.5 మిలియన్ టన్నుల సామర్థ్యం, హిందాల్కో 1.4 మిలియన్ టన్నులు, ప్రభుత్వ రంగ సంస్థ నాల్కో 0.5 మిలియన్ టన్నులు ఉత్పత్తితో ఈ మార్కెట్లో బలమైన స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు రిలయన్స్ కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తుండటంతో పాటు.. అప్ కమ్మింగ్ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న అదానీ గ్రూప్‌తో ముఖేష్ అంబానీకి నేరుగా పోటీ ఏర్పడే అవకాశం ఉంది.

భవిష్యత్ డిమాండ్ లాభదాయకత:
అల్యూమినియం తయారీ పరిశ్రమ అనేది అత్యధిక విద్యుత్ వినియోగం ఉన్న రంగం. రిలయన్స్ ప్రతిపాదించిన రూ.2లక్షల 73వేల కోట్ల భారీ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుతో ఈ కరెంట్ అవసరాలను సులభంగా అధిగమించవచ్చు. దీనివల్ల వాణిజ్యపరంగా ఉత్పత్తి వ్యయం తగ్గి, లాభదాయకత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ రెండు దిగ్గజాల రాకతో భారతీయ అల్యూమినియం మార్కెట్ కొత్త పోటీకి అడుగులు పడుతున్నాయని నిపుణులు అంటున్నారు. చూడాలి పాత దిగ్గజ సంస్థల ముందు అంబానీ, అదానీ గేమ్ ఎలా ఉంటుందన్నది.