Hardik Pandya: ఐపీఎల్ 2027 కోసం అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతుండగా, ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (MI) క్యాంప్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. గత ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏకంగా 9వ స్థానానికి పడిపోయిన ముంబై జట్టులో ఇప్పుడు భారీ మార్పులే చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫ్రాంచైజీని వీడేందుకు సిద్ధమయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ సాహిల్ మల్హోత్రా లీక్ చేసిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాయల్స్‌తో యశస్వి జైస్వాల్ ట్రేడింగ్ వార్తలకు ఇంకా ఎలాంటి క్లారిటీ రాకపోయినా, హార్దిక్ పాండ్యా మాత్రం ఐపీఎల్ 2027లో ముంబై తరఫున ఆడటం లేదని కన్ఫర్మ్ అయింది. గతంలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు గుజరాత్ టైటాన్స్ కూడా హార్దిక్ విషయంలో ఆసక్తి చూపింనప్పటికీ, గుజరాత్‌కు కెప్టెన్‌గా వెళ్తానన్న హార్దిక్ కోరికను ఆ ఫ్రాంచైజీ తిరస్కరించింది. ఏది ఏమైనా హార్దిక్ కొత్త డెస్టినేషన్ ఇంకా ఫిక్స్ కాకపోయినా ముంబైకి మాత్రం బై-బై చెప్పడం ఖాయంగా కనోస్తుంది.
లండన్‌లో రివ్యూ మీటింగ్:
ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచి ఏకంగా 6 ఏళ్లు పూర్తయింది. ఫ్రాంచైజీ చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన విజయం లేని కాలం కావడంతో మేనేజ్‌మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇంగ్లండ్‌లో ది హండ్రెడ్ లీగ్ జరుగుతున్న సమయంలోనే ముంబై ఓనర్స్ లండన్‌లో ఒక ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో ఐపీఎల్ 2027కి ముందే జట్టులో భారీ మార్పులు (Massive Overhauls) చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ క్రమంలోనే సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా హెచ్చరికలు జారీ అయ్యే అవకాశం ఉంది. అంతటితో ఆగకుండా, సూర్యకుమార్ యాదవ్ (SKY) కూడా ముంబై ఫ్రాంచైజీని వీడేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం వస్తుంది.
డేంజర్‌లో హెడ్ కోచ్ మహేళ జయవర్ధనె జాబ్:
ఆటగాళ్లే కాకుండా కోచింగ్ స్టాఫ్‌పై కూడా ముంబై ఇండియన్స్ యాజమాన్యం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయింది. 2017లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి జట్టుకు 3 ట్రోఫీలు అందించిన శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్ధనె పదవి కూడా ఇప్పుడు ప్రమాదంలో పడింది. 2022లో ఆయన ముంబై గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్‌గా ప్రమోట్ అవ్వగా, ఆ తర్వాత మార్క్ బౌచర్ హయాంలో ముంబై ఘోర ప్రదర్శన చేయడంతో జయవర్ధనెను మళ్లీ హెడ్ కోచ్‌గా తీసుకొచ్చారు. కానీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా కొనసాగటం లేదు, 2026 సీజన్ డిజాస్టర్ అవ్వడంతో ఐపీఎల్ 2027కి ముందే జయవర్ధనెపై వేటు వేసేందుకు ముంబై ఫ్రాంచైజీ సిద్ధమవుతోంది.
