ఖాట్మండు: DRDO మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులకు పెను ప్రమాదం తప్పింది. మానస సరోవరం విహార యాత్రకు వెళ్లిన సతీష్ రెడ్డి దంపతులు నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నుంచి తృటిలో తప్పించుకున్నారు. హిమాలయాల్లో సంభవించిన భూకంప ప్రభావంతో బుధవారం (ఆగస్ట్ 26) నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విపత్తు సంభవించడానికి కొన్ని గంటల ముందే వరదలు వచ్చిన ప్రాంతాన్ని ఆయన వదిలి వెళ్లారు. సతీష్ రెడ్డి దంపతులు వెళ్లిన కాసేపటికే ఆ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ప్రస్తుతం సతీష్ రెడ్డి దంపతులు సాగా ప్రాంతంలో సురక్షితంగా ఉన్నారు. ఇండియా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. 2026, మే 31న మానస సరోవర్ యాత్రకు నేపాల్‌కు బృందంగా వెళ్లామని తెలిపారు. నేపాల్లో బుధవారం (ఆగస్ట్ 26) వచ్చిన ఆకస్మిక వరదల నుంచి తృటిలో తప్పించుకున్నామని చెప్పారు. మేం వెళ్లొచ్చిన కాసేపటికే ఒక్కసారిగా వరదలు సంభవించాయని తెలిపారు. ప్రస్తుతం తాము సాగా ప్రాంతంలో సురక్షితంగా ఉన్నామని చెప్పారు. ఇండియా వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్ నుంచి వచ్చే సిట్యూయేషన్ లేదని.. చైనా నుంచి భారత్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
నేపాల్లో పెను విధ్వంసం:
హిమాలయ దేశం నేపాల్లో బుధవారం (ఆగస్ట్ 26) ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న భోటే కోశీ నది ఉధృతికి నువాకోట్, ధాదింగ్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. క్షణాల వ్యవధిలోనే వరద నీరు ముంచెత్తడంతో పలు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 157 మంది మృతి చెందగా, వందలాది మంది గల్లంతయ్యారు.
భూకంపంతో సుమారు 17 వేల అడుగుల ఎత్తున ఉన్న గ్లేసియర్ నుంచి 2 వేల అడుగుల వెడల్పు గల భారీ మంచు దిమ్మె అకస్మాత్తుగా విరిగిపడింది. ఆ మంచు దిమ్మె దాదాపు 4 వేల అడుగుల లోతులోని లోయలోకి పడటంతో తీవ్ర ఒత్తిడి వల్ల మంచు, నీరు, రాళ్ల మిశ్రమంగా మారి 'లెండె ఖోలా', 'భోటీకోశీ' నదుల్లోకి ఉప్పొంగింది. ఈ ప్రవాహం దిగువనున్న గ్రామాలను ముంచెత్తింది.
టిబెట్లో పుట్టి నేపాల్లోని త్రిశూలి నదిలో కలిసే భోటే కోశీ నది ఉగ్రరూపం దాల్చడంతో టిమురే బజార్, రసువా సరిహద్దు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 12 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వరద ప్రవాహం క్రమంగా భారత్లోని గండక్ నది వైపు వెళ్తుండటంతో నదీ పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు.
800 మందికి పైగా గల్లంతు
వరద ఉధృతికి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 403 మంది టూరిస్టులు సహా 800 మందికి పైగా గల్లంతైనట్టు నేపాల్ వెల్లడించింది. టూరిస్టుల్లో 142 మంది ఇండియన్లు సహా 341 మంది విదేశీయులు, 93 మంది స్థానికులు ఉన్నారు. మరోవైపు, రసువా జిల్లాలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న 26 మంది నేపాల్ పోలీసులు, ఏడుగురు సాయుధ బలగాల సిబ్బంది కూడా వరదలో కొట్టుకుపోయారని సమాచారం.
భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్
నేపాల్లో చిక్కుకున్న యాత్రికులకు సాయం సమాచారం అందించేందుకు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. +977 985 1316807, +977 970910 7500 సంప్రదించాలని ఇండియన్ ఎంబసీ తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులు ఈ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది.
