మొజ్తాబా ఖమేనీ సచ్చిపోలే.. బతికే ఉండు: ట్రంప్

మొజ్తాబా ఖమేనీ సచ్చిపోలే.. బతికే ఉండు: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నాడా లేదా అని సందిగ్ధానికి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెరదించారు. మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నాడని.. కానీ అమెరికా దాడుల్లో అతడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. ఖమేనీ శరీరం తీవ్రంగా దెబ్బతిన్నదని.. ముఖ్యంగా అతడి ఎడమ చేయి, కాలు తీవ్రంగా గాయపడ్డాయని చెప్పారు.

ఇరాన్ ప్రభుత్వం మోజ్తాబా ఆరోగ్యంపై వస్తున్న వార్తలను దాచిపెడుతూ కపట నాటకం ఆడుతోందని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధం చాలా త్వరగతిన ముగింపునకు రానుందని ఆయన అంచనా వేశారు. కాగా, ప్రముఖ అమెరికన్ కామెంటేటర్ గ్లెన్ బెక్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2026, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‎పై మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా.. ఆయన కుటుంబ సభ్యులు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయతొల్లా ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీ కూడా ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ దాడుల తర్వాత ఖమేనీ బహిరంగంగా ఎక్కడ కనిపించలేదు. చివరకు ఆయన తండ్రి అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. దీంతో మోజ్తాబా ఖమేనీ కూడా చనిపోయాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నాడని ట్రంప్ పేర్కొనడంతో అతడి మరణ వార్తల పుకార్లకు తెరపడింది.