- హత్యకేసులో వీరన్న అనే వ్యక్తికి జీవితఖైదు
- 1984లో పెరోల్ పై బయటికి వచ్చి.. ప్రభుత్వ టీచర్ కొలువు
- బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఇచ్చిన సర్కార్
- రిటైరై పెన్షన్ పొందుతున్నప్పుడు గుర్తింపు
- అరెస్ట్ చేసి జైలుకు తరలించిన పోలీసులు
- మళ్లీ పెరోల్ ఇవ్వాలంటూ భార్య పిటిషన్
- స్టోరీ విని అవాక్కయిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హత్య కేసులో జీవితఖైదు పడి పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన ఓ ఖైదీ.. 40 ఏండ్లకు పైగా పరారీలో ఉన్నాడు. ఈ సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి దాదాపు 30 ఏండ్లు సర్వీసు చేశాడు. బెస్ట్ టీచర్అవార్డు కూడా అందుకున్నాడు. చివరకు రిటైరై పెన్షన్ పొందుతున్న సమయంలో పోలీసులు అతడిని గుర్తించి అరెస్టు చేశారు.
ఈ ఘటనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరోల్ గడువు ముగిసిన తర్వాత ఖైదీ తిరిగి జైలుకు వచ్చాడా? లేదా? అన్నది అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. పెరోల్‌పై విడుదలయ్యే ఖైదీలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఇన్నేండ్లు పనిచేసినా అధికారులు గుర్తించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
1984 నుంచి పరారీలోనే.
.
మహబూబాబాద్ జిల్లా పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందుల వీరన్నపై 1982లో హత్య కేసు నమోదైంది. విచారణ అనంతరం 1983 జూన్ 9న వరంగల్ అదనపు జిల్లా న్యాయమూర్తి వీరన్నకు జీవితఖైదు విధించారు. దీంతో పోలీసులు అతన్ని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, అదే ఏడాది డిసెంబర్ 17న వీరన్న 30 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం 1984 మార్చి 17 వరకు అతని పెరోల్గడువును పొడిగించారు. మార్చి 18న వీరన్న తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. అయితే, అప్పటి నుంచి 40 ఏండ్ల 58 రోజులపాటు అతడు పోలీసులకు చిక్కలేదు. ఆ సమయంలో వీరన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందాడు. దాదాపు 30 ఏండ్లు ప్రభుత్వ సర్వీసులో పనిచేసి 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్నాడు. 2013లో పదవీ విరమణ చేసి పెన్షన్ కూడా పొందాడు. 2024 మే 16న వరంగల్ సెంట్రల్ ప్రిజన్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అతడిని గుర్తించి అరెస్టు చేసి తిరిగి జైలుకు తరలించింది.
మరోసారి పెరోల్ ఇవ్వాలని భార్య పిటిషన్..
మరోసారి 2024 సెప్టెంబర్ 10న వీరన్నకు 27 రోజుల పెరోల్ లభించగా జైలు అధికారులు రద్దు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంతో మూడేండ్లపాటు పెరోల్ ఇవ్వద్దని నిర్ణయించారు. అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరన్న భార్య సండెల చారమ్మ(73) హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు జస్టిస్ టి.మాధవీదేవి ఇటీవల కొట్టివేశారు. పెరోల్ గడువు ముగిసిన వెంటనే ఖైదీలు తిరిగి జైలుకు చేరేలా పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, జైళ్ల శాఖకు సూచించారు. 40 ఏండ్లు వీరన్న పరారీలో ఉండడంపై కోర్టు ఆశ్చర్య వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
