- వివరణ ఇచ్చేందుకు రావాలంటున్న బీఎల్వోలు
- వృద్ధులు, దివ్యాంగులకు తప్పని తిప్పలు
- గంటల తరబడి మున్సిపల్ ఆఫీసుల వద్ద క్యూ
- భారీగా వస్తున్న జనం.. కనీస సౌకర్యాలు కరువు
కరీంనగర్‌లోని దుర్గమ్మగడ్డకు చెందిన చిలుక కనకవ్వ పేరు ముసాయిదా జాబితాలో ఉంది. అయినప్పటికీ ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న పేరుకు, మునుపటి (2002) సమగ్ర సవరణలో ఉన్న పేరుకు మధ్య వ్యత్యాసం ఉందని, కార్పొరేషన్ ఆఫీసుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఎన్నికల అధికారుల నుంచి నోటీసులు అందాయి. వృద్ధాప్యం కారణంగా ఆమె వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆమె కుమారుడు చిలుక వినోద్ కుమార్ విచారణకు హాజరై తన తల్లిదండ్రుల ఆధార్, ఓటర్ ఐడీ కార్డులు, ఇతర ఆధారాలు సమర్పించారు.
కరీంనగర్‌లోని అమీర్నగర్కు చెందిన మహమ్మద్ ఆరిఫ్ మొహివుద్దీన్ పేరు ముసాయిదా జాబితాలో వచ్చింది. 2002 సర్ లోనూ ఆయనకు ఓటు ఉంది. కానీ అప్పటి పేరుకు, ఇప్పటి పేరుకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొంటూ నోటీసులు అందాయి. ఈ నెల 31న ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది.
కరీంనగర్, వెలుగు: ఓటర్లకు సర్ నోటీసులు గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేర్లు చూసుకుని ఊపిరి పీల్చుకున్న ఓటర్లకు.. తాజాగా అందుతున్న నోటీసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో తమకు కేటాయించిన టైంలో వివరణతోపాటు ఆధారాలు సమర్పించేందుకు మున్సిపాలిటీలకు క్యూ కడుతున్నారు. కరీంనగర్ బల్దియాలో బుధవారం మిలాద్ ఉన్ నబీ సెలవు రోజయినప్పటికీ.. సర్ నోటీసులకు రిప్లై ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లు నిర్వహించడంతో వందలాది మంది వివిధ ధ్రువపత్రాలతో తరలివచ్చారు.
కాగా, ఎన్యుమరేషన్ ఫారాలను నింపాక తమ ఇండ్లకు వచ్చి తీసుకెళ్లిన సిబ్బంది, అందులో తప్పులుంటే అప్పుడే ఎందుకు చెప్పలేదని, తీరా ఇప్పుడు నోటీసులు ఇచ్చి మున్సిపల్ ఆఫీసులకు ఎందుకు రప్పించుకుంటున్నారని ఓటర్లు నిలదీస్తున్నారు. బల్దియాలో ఏర్పాట్లు చేయకపోవడం, తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించకపోవడంపై మండిపడ్తున్నారు. మంచాలకు పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులను ఆఫీసులకు తీసుకురావడం ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు.
92 లక్షల మందికి నోటీసులు..
ఓటరు జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) లో భాగంగా కీలకమైన నోటీసుల పంపిణీ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా వేగం పుంజుకుంది. ముసాయిదా జాబితాలో ఉన్న మొత్తం 2 కోట్ల 64 లక్షల 87 వేల 213 మంది ఓటర్లలో ఏకంగా 92 లక్షల 87 వేల 577 మందికి నోటీసులు అందుతున్నాయి. అక్టోబర్ 15 నాటికే ఈ నోటీసుల జారీ చేసి విచారణ పూర్తి చేయాల్సి ఉంది. నోటీసులు అందబోయే వారి జాబితాలు ఆన్లైన్లో పెడ్తామని ఈసీ చెప్పినప్పటికీ ‘అనమాలిస్’లో పేరు ఉందనే ఒక చిన్న ఇండికేషన్ తప్ప ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
దీంతో నోటీసు చేతికి వచ్చాకే అసలు విషయం తెలుస్తున్నది. పేర్లలోని చిన్నపాటి అక్షర దోషాలు (స్పెల్లింగ్ మిస్టేక్స్), ఇంటిపేరులో తేడాలు వంటి స్వల్ప పొరపాట్లను తక్షణమే అప్‌డేట్ చేయాలని ఈఆర్‌వోలను ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా, నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఈసీ చెప్పినప్పటికీ అధికారులు తప్పనిసరిగా రావాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఓటర్లు వాపోతున్నారు.
అక్షర దోషాలు, వయస్సులో తేడాలు..
బుధవారం కరీంనగర్ బల్దియాకు వచ్చినవారిలో చిన్నచిన్న అక్షర దోషాలు ఉన్నవారు, ఇంటి పేర్లు తప్పుగా పడినవారు ఉన్నారు. తోబుట్టువుల మధ్య తొమ్మిది నెలల కంటే తక్కువ ఏజ్ గ్యాప్ ఉండడం, తల్లిదండ్రులు, పిల్లల మధ్య 15 ఏండ్ల కంటే తక్కువ లేదా 50 ఏండ్ల కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండటం, తాత-మనుమండ్ల మధ్య 40 ఏండ్ల కంటే తక్కువ వయస్సు తేడా ఉండడం సమస్యగా మారింది. పుట్టిన తేదీ తెలియని చాలామంది అనామత్‌గా తమ వయస్సు చెప్తే ఆధార్‌కార్డుల్లో ఇష్టం వచ్చిన తేదీలు, సంవత్సరాలు వేయడం సమస్యగా మారింది.
ఇక ఓటరు పేరు లేదా వారి తల్లిదండ్రుల పేరు గత 2002 ఓటర్ల జాబితాతో లింక్ కాకుంటే అలాంటి వారికి 'అన్‌మ్యాప్డ్' కేటగిరీ కింద నోటీసులు జారీ చేసినట్టు చెప్తున్నారు. తల్లిదండ్రుల పేర్లలో తేడా, బంధుత్వ వివరాల్లో మార్పుల వల్ల కూడా నోటీసులు అందాయని పలువురు ఓటర్లు పేర్కొన్నారు. 2002లో ఓటరుగా ఉన్న తన వివరాలు సమర్పించినప్పటికీ తమ తండ్రి వివరాలు నమోదు చేయనందుకు తమకు నోటీస్ వచ్చిందని మరో ఓటరు వాపోయాడు.
ఈ ఆధారాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సిందే..
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగి/ పింఛన్‌దారుకు జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు/పింఛన్ పే స్లిప్.
- జులై 1, 1987 కు ముందు ప్రభుత్వం/స్థానిక అధికార యంత్రాంగం/బ్యాంకులు/పోస్టాఫీసు/ఎల్ఐసీ/ ప్రభుత్వరంగ సంస్థల ద్వారా భారత దేశంలో జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు/ధ్రువీకరణ పత్రం/డాక్యుమెంట్.
- కాంపెటెంట్ అథారిటీ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం.
- పాస్ పోర్ట్
- గుర్తింపు పొందిన బోర్డులు/యూనివర్సిటీలు జారీ చేసిన విద్యార్హత ధ్రువీకరణ పత్రం.
- సంబంధిత కాంపెటెంట్ అథారిటీ జారీ చేసిన పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికెట్.
- అటవీ హక్కుల ధ్రువీకరణ పత్రం
- ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఏదైనా కుల ధ్రువీకరణ పత్రం
- రాష్ట్ర/ స్థానిక అధికారులచే తయారు చేసిన కుటుంబ రిజిస్టర్
- ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి/ఇంటి కేటాయింపు ధ్రువీకరణ పత్రం.
