కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇండియా గెలుపు దిశగా పయనిస్తోంది. బుధవారం నాలుగో రోజు లంక బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేసినా టీమిండియా బౌలర్లు సరైన సమయంలో పుంజుకుని హోమ్ టీమ్‌ను ఒత్తిడిలో పడేశారు. దాంతో ఫాలో ఆన్‌తో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన లంక ఆట ముగిసే సమయానికి 72.4 ఓవర్లలో 229/6 స్కోరు చేసింది. సోనల్ దినుషా (7 బ్యాటింగ్), కేశార నువాంత (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
పసిందు సూరియబండార (173 బాల్స్‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 92), కమింద్ మెండిస్ (93 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) అద్భుతంగా పోరాడి తొలి ఇన్నింగ్స్ లోటును మాత్రం పూడ్చగలిగారు. అంతకుముందు 265/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన లంక తొలి ఇన్నింగ్స్‌లో 89.4 ఓవర్లలో 290 రన్స్‌కు ఆలౌటైంది.
దాంతో ఫాలో ఆన్‌కు 13 రన్స్ దూరంలో ఆగిపోయింది. సోనల్ దినుషా (162 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103) సెంచరీతో చెలరేగినా ప్రయోజనం దక్కలేదు. ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో మూడు వికెట్లతో లంకను కట్టడి చేశారు. మరో రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో లంక 16 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఆదుకున్న పసిందు, మెండిస్
తీవ్ర ఒత్తిడిలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన లంకను ఆరంభంలోనే ఇండియా బౌలర్లు దెబ్బతీశారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే సిరాజ్ (1/11).. లాహిరు ఉడార (3)ను ఔట్ చేశాడు. 5/1 స్కోరు వద్ద వచ్చిన పసిందు సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఎండ్‌లో కమిల్ మిశార (32) ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడాడు. పసిందుతో కలిసి చకచకా రన్స్ రాబట్టాడు. కానీ 15వ ఓవర్‌లో జడేజా (1/48) వేసిన టర్నింగ్ బాల్‌కు మిశార ఎల్బీ అయ్యాడు.
దాంతో రెండో వికెట్‌కు 58 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగియడంతో లంక 63/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో పసిందుతో జత కట్టిన కమింద్ మెండిస్ పోరాటస్ఫూర్తి చూపెట్టాడు. రెండువైపుల నుంచి ఇండియా బౌలర్లు చేసిన ముప్పేట దాడిని సమర్థంగా ఎదుర్కొన్నారు. ఫలితంగా లంచ్ వరకు 83/2 స్కోరు చేశారు. బ్రేక్ తర్వాత పసిందు, మెండిస్ మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేశారు.
పేస్, స్పిన్ బౌలింగ్‌లో స్వేచ్ఛగా షాట్లు ఆడారు. మానవ్ సుతార్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన మెండిస్.. లెఫ్టార్మ్ స్పిన్నర్ లయను దెబ్బతీశాడు. పసిందు కూడా సుతార్ బౌలింగ్‌లోనే స్లాగ్ స్వీప్‌తో సిక్స్ కొట్టాడు. ఈ ఇద్దరు క్రీజులో ఉన్నంతసేపు సుతార్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఈ క్రమంలో ప్రసిధ్ కృష్ణ (1/31) బౌలింగ్‌లో ఫుల్ షాట్ సిక్స్ కొట్టిన మెండిస్ 87 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
ఆ వెంటనే పసిందు కూడా 78 బాల్స్‌లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. దాదాపు 110 నిమిషాలు క్రీజులో పాతుకుపోయిన ఈ జంటను 44వ ఓవర్‌లో ప్రసిధ్ విడదీశాడు. అద్భుతమైన షార్ట్ పిచ్ బాల్‌ను సంధించగా మెండిస్ భారీ షాట్ కొట్టగా గిల్ రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా మూడో వికెట్‌కు 115 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. టీ బ్రేక్‌కు లంక 199/3 స్కోరుతో నిలిచింది.
అయితే ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవడానికి 14 రన్స్ అవసరం కాగా మూడో సెషన్‌లో చకచకా వికెట్లు కోల్పోవడం లంకను ఘోరంగా దెబ్బతీసింది. మానవ్ సుతార్ బౌలింగ్‌లో ఇన్‌సైడ్ ఎడ్జ్ క్యాచ్ ఇచ్చిన కెప్టెన్ ధనంజయ్ డిసిల్వ (23) స్లిప్‌లో పడిక్కల్‌కు చిక్కాడు. నాలుగో వికెట్‌కు 31 రన్స్ జతయ్యాయి. ఇక సెంచరీ దిశగా సాగుతున్న పసిందు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కొంప ముంచింది.
అప్పటివరకు నిలకడగా ఆడిన పసిందు.. సుతార్ బౌలింగ్‌లో ఒక్కసారిగా బ్యాట్ ఝుళిపించాడు. దీన్ని పసిగట్టిన సుతార్ వికెట్లకు దూరంగా బాల్‌ను వేయగా ముందుకొచ్చిన పసిందును పంత్ స్టంపౌట్ చేశాడు. బాల్‌ను బాగా టర్న్ చేసిన సారాన్ష్ జైన్ (1/55).. నిరోషన్ డిక్వెల్లా (6)ను ఔట్ చేయడంతో లంక 218 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయింది. కొద్దిసేపటి తర్వాత వర్షం రావడంతో ఆటను త్వరగా ముగించారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 89.4 ఓవర్లలో 290 ఆలౌట్ (సోనల్ దినుషా 103, ప్రసిధ్ 3/52, మానవ్ సుతార్ 3/85). శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 72.4 ఓవర్లలో 229/6 (పసిందు సూరియబండార 92, కమింద్ మెండిస్ 55, మానవ్ సుతార్ 2/81).
