ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ‘ఖేలో ఇండియా గేమ్స్’

ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ‘ఖేలో ఇండియా గేమ్స్’
  •     నిర్వహణకు రూ.22 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
  •     హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‍నగర్ లో పోటీలు
  •     తెలంగాణకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం​

న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది జరగనున్న 8వ ఎడిషన్ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ ను తెలంగాణలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈ గేమ్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఇందుకోసం కేంద్రం రూ.22 కోట్లు విడుదల చేసిందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ), నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్), స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జీఎఫ్ఐ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఖేలో ఇండియా పథకం అడ్ హక్ కమిటీ, స్టీరింగ్ కమిటీ సంయుక్తంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌‌నగర్ వేదికగా ఈ పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 25 క్రీడాంశాల్లో పోటీలు జరుగనున్నాయని, ఆతిథ్య రాష్ట్రమైన తెలంగాణ.. ఒక స్థానిక క్రీడను ప్రతిపాదించవచ్చని పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఆరు వేల మంది క్రీడాకారులు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు. తెలంగాణకు కేంద్రం ఈ క్రీడలను నిర్వహించే అవకాశం కల్పించడంపై కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.