- రిజస్టర్లలో నమోదు చేస్తున్న స్టూడెంట్లు, లెక్చరర్లు
- గతేడాదే జూనియర్ కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్ ఏర్పాటు
- రెన్యువల్ చేయని ఇంటర్ విద్యాశాఖ
- నిలిచిపోయిన డిజిటల్ అటెండెన్స్ పర్యవేక్షణ
హైదరాబాద్, వెలుగు: సర్కారు కాలేజీల్లో సంస్కరణల పేరుతో తెచ్చిన ఫెషియల్ అటెండెన్స్ టెక్నాలజీ ఏడాదికే అటకెక్కింది. ఇంటర్ విద్యార్థులు, లెక్చరర్ల హాజరు కోసం గతేడాది ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్ట్ రెన్యువల్ చేయడంలో వైఫల్యం కారణంగా కాలేజీలు మళ్లీ మొదటికొచ్చి పాత రిజిస్టర్ల పద్ధతినే నడిపిస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా.. ఎఫ్ఆర్ఎస్‌పై స్పష్టత ఇవ్వకపోవడంపై ఇంటర్ విద్యాశాఖ తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎఫ్‌ఆర్‌ఎస్‌తో పెరిగిన అటెండెన్స్
రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఎఫ్ఆర్ఎస్ నిర్వహించిన ఏజెన్సీ ద్వారానే 2025–26లో ఇంటర్మీడియెట్‌లో ఫెషియల్ అటెండెన్స్ అమలు చేశారు. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 కాలేజీల్లో ఉన్న 9,500 మంది ఫ్యాకల్టీతో పాటు ఆయా కాలేజీల్లో చదివే సుమారు 1.70 లక్షల మందికి అమలు చేశారు. ఎఫ్ఆర్ఎస్ విధానంతో రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల్లోని పిల్లలు, లెక్చరర్లలో అటెండెన్స్ పెరిగింది. దీంతో ఆయా కాలేజీలపై నమ్మకం కూడా పెరిగి, ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు కూడా భారీగా పెరిగాయి. కానీ, గతేడాది ఎఫ్ఆర్ఎస్ నిర్వహించిన ఏజెన్సీతో కాంట్రాక్టును ఇంటర్ విద్యాశాఖ ఈ ఏడాది రెన్యువల్ చేసుకోలేదు. దీంతో 2026–27 అకాడమిక్ ఇయర్‌లో ఫెషియల్ అటెండెన్స్ అటకెక్కినట్లయింది.
దీంతో జూన్ నెలాఖరు నుంచి యాప్ పనిచేయడం ఆగిపోయింది. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో డిజిటల్ అటెండెన్స్ నిలిచిపోయింది. మళ్లీ మ్యాన్యువల్‌గా రిజిస్టర్లే దిక్కయ్యాయి. దీంతో లెక్చరర్లు, స్టూడెంట్ల డుమ్మాలు పెరిగాయనే వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా.. జీతాలనూ ఎఫ్ఆర్ఎస్‌కు అనుసంధానం చేసి ఇవ్వాలని ఆదేశాలు ఇస్తున్నా.. ఇంటర్ విద్యాశాఖ మాత్రం అమలులో జాప్యం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమైన కొత్త సంస్థకు ఎఫ్ఆర్ఎస్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలనుకుంటే.. ఆ పనులను ముందే పూర్తి చేసుకుంటే బాగుండేదని, కొత్త విధానం అమలయ్యే వరకూ పాత సంస్థతోనే కంటిన్యూ చేయాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఇంటర్ కాలేజీల్లో ఫెషియల్ అటెండెన్స్ అమలు చేయించాలని లెక్చరర్లు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
ముందు లెక్చరర్లకైనా పెట్టండి
గతంలో ఇంటర్ విద్యలో గత కమిషనర్లు కేవలం తమ కమీషన్ల కోసమే బయోమెట్రిక్, ఎఫ్ఆర్ఎస్ విధానాలు తెచ్చారు. ఇవి విద్యార్థులు, లెక్చరర్ల కోసం తెచ్చినవి కాదు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని కాలేజీల్లో ఫెషియల్ అటెండెన్స్ ఉండాలని కోరుతున్నా.. ఇంటర్ విద్యాశాఖలో మాత్రం అమలు కాకపోవడం దారుణం. ఏమైనా ఇబ్బందులుంటే స్టూడెంట్లకు లేకపోయినా, ముందు లెక్చరర్లకు ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయాలి.
- మధుసూదన్ రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్
