ఓరుగల్లులో మారిన వినాయక విగ్రహాల అడ్డా!

 ఓరుగల్లులో  మారిన వినాయక విగ్రహాల అడ్డా!
  •      గణపతి ప్రతిమల అమ్మకాలకు నెలవుగా వరంగల్ ఎంజీఎం, కేఎంసీ, భద్రకాళి టెంపుల్, జీడబ్ల్యూఎంసీ రోడ్లు
  •      ఈసారి రోడ్లు బ్లాక్ అయి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా పోలీసుల చర్యలు
  •      అంబులెన్సులు, ఎమర్జెన్సీ అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్లాన్
  •      ఇప్పటికే తయారీదారులతో ఆఫీసర్ల మీటింగ్

హనుమకొండ, వెలుగు: వరంగల్‌‌‌‌ నగరంలో వినాయక విగ్రహాల విక్రయాల అడ్డా మారింది. ఇన్నాళ్లూ కాకతీయ మెడికల్‌‌‌‌ కాలేజీ నుంచి ఎంజీఎం, భద్రకాళి టెంపుల్‌‌‌‌ లేన్‌‌‌‌, జీడబ్ల్యూఎంసీ హెడ్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ రోడ్లపై విగ్రహాల విక్రయాలు జరిగేవి. అయితే, కేఎంసీ సూపర్‌‌‌‌ స్పెషాలిటీ, ఎంజీఎం ఆస్పత్రులకు వచ్చే అంబులెన్స్‌‌‌‌లు, ఎమర్జెన్సీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఆఫీసర్లు విక్రయ ప్రదేశాలను మార్చారు.

ఎంజీఎం సెంటరే మెయిన్ అడ్డా..

వరంగల్​లో ఎంజీఎం సెంటర్‌‌‌‌ వినాయక విగ్రహాల విక్రయాలకు ప్రధాన అడ్డాగా ఉండేది. చవితికి పది రోజుల ముందే వేలాది విగ్రహాలను రోడ్లపై ఉంచడంతో ట్రాఫిక్‌‌‌‌ సమస్యలు తలెత్తేవి. కేఎంసీ నుంచి ఎంజీఎం వరకు, భద్రకాళి టెంపుల్ లైన్, పాపయ్యపేట చమన్ రోడ్డు, వెంకట్రామ జంక్షన్ రోడ్లన్నీ గణపతి విగ్రహాలతో నిండిపోతుంటాయి. రాజస్థాన్, యూపీ నుంచి వచ్చినవారితో పాటు స్థానికులూ ఇక్కడ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఏటా వేల సంఖ్యలో విగ్రహాలు తయారు చేస్తుండగా, నగరంలో అమ్ముడవుతున్న వాటిలో సగం ఇక్కడి నుంచే వెళ్తుండటం గమనార్హం. ఇంతవరకు బాగానే ఉన్నా వినాయక చవితికి దాదాపు పది రోజుల ముందు నుంచే తయారీదారులు విగ్రహాలను రోడ్లపై పెడుతుంటారు. దీంతో వేలాది విగ్రహాలు, వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చే జనాలు, వాహనాలతో కేఎంసీ నుంచి ఎంజీఎం వరకు  రోడ్డు మొత్తం కిక్కిరిసిపోతుంటుంది. 

ఐదు చోట్ల ఏర్పాట్లు..

ఈసారి వినాయక విగ్రహాల విక్రయాలకు ప్రత్యామ్నాయంగా వరంగల్‌‌‌‌ వైపు చింతల్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌, ఉర్సు రంగలీలా మైదానం, ఓ సిటీ గ్రౌండ్‌‌‌‌, హనుమకొండ వైపు హయగ్రీవాచారి గ్రౌండ్‌‌‌‌, పద్మాక్షి టెంపుల్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లను ఎంపిక చేశారు. అవసరాన్ని బట్టి చిన్న విగ్రహాల విక్రయాలకు తోటబడి గ్రౌండ్‌‌‌‌ను కూడా వినియోగించనున్నారు. అడ్డా మార్పుపై మొదట వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేసినా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇతర ఆఫీసర్లు సమావేశం నిర్వహించి ఆస్పత్రుల వద్ద ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి ఒప్పించారు. ట్రాఫిక్‌‌‌‌ నియంత్రణ, సమన్వయం కోసం పోలీసులు, జీడబ్ల్యూఎంసీ టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌, డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. విక్రయదారుల విజ్ఞప్తి మేరకు కొత్త ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఎమర్జెన్సీలో ఇబ్బందులు తలెత్తకుండా..

వినాయక విగ్రహాల కోసం పెద్ద సంఖ్యలో వచ్చే జనం, వెహికల్స్, క్రేన్స్ తో ఎంజీఎం సర్రౌండింగ్స్ లో సమస్యలు ఏర్పడుతున్నాయి. అంబులెన్సులు, ఇతర ఎమర్జెన్సీ సమయాల్లో ఇబ్బందులు పడాల్సివస్తోంది. అందుకే విగ్రహాల విక్రయాలకు ఈసారి ప్రత్యేక ప్రదేశాలను కేటాయించాం. ఇందుకు విక్రయదారులకు కూడా అవగాహన కల్పించాం. వారి సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. 
- టి.సత్యనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ, వరంగల్