ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్లు లేకపోవడంతోనే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. బుధవారం విద్యానగర్ బీసీ భవన్ లో విద్యార్థి నిరుద్యోగ జేఏసీ నేత మోడీ రాందేవ్ నేతృతంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7 వేల స్కూళ్లలో 30 మంది స్టూడెంట్లు కూడా లేరన్నారు.
దీనికి టీచర్లు లేకపోవడమే కారణమని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యా ప్రమాణాలు పెంచాలని, అప్పుడే విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందన్నారు.
విద్యా వ్యవస్థ మెరుగుపడాలంటే, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 34 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో బీఈడీ, డీఎడ్ చేసిన 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అనంతరం ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
