‘నార్త్ గో బ్యాక్’ ఉద్యమంతోనే దక్షిణాదికి న్యాయం: దక్షిణ జనతా పార్టీ జాతీయ కో ఆర్డినేటర్

‘నార్త్ గో బ్యాక్’ ఉద్యమంతోనే దక్షిణాదికి న్యాయం: దక్షిణ జనతా పార్టీ జాతీయ కో ఆర్డినేటర్

ఓయూ, వెలుగు: ఉత్తరాది గో బ్యాక్  ఉద్యమంతోనే తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని దక్షిణ జనతా పార్టీ జాతీయ కో ఆర్డినేటర్  ప్రొఫెసర్  గాలి వినోద్ కుమార్  పేర్కొన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఆ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసి పలువురికి నియామకపత్రాలు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణాది ప్రజలను చైతన్య పరిచి, హక్కులు, ఆత్మగౌరవం, స్వయంపాలన, అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దక్షిణాది ఉద్యమాన్ని మొదలు పెడుతున్నామని చెప్పారు.

80 ఏండ్లుగా దక్షిణాదికి ద్రోహం చేస్తూనే ఉన్నారని, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ఉత్తరాది పార్టీగా మారిందని విమర్శించారు. రెండో రాజధాని, సుప్రీంకోర్టు బెంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. దక్షిణాదికి ద్రోహం చేసే డీ లిమిటేషన్  చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని, నీట్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్  చేశారు.

ఉత్తరాది వ్యాపార ఆధిపత్యం ఎక్కువైందని, ఉత్తరాది దోపిడీదారులను తరిమేయడానికి విద్యార్థి విభాగం పోరాటం చేస్తుందని తెలిపారు. అనంతరం బరిగల రాజు, రమేశ్, ఎం సాయిరాజు, కె అంజి, సురేశ్, సందీప్, భిక్షపతి, శ్రీహరికి నియామకపత్రాలు అందజేశారు.

మరిన్ని వార్తలు