తెలంగాణ మహిళా శక్తికి జాతీయ గుర్తింపు.. పీఎంఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్‌‌లో తెలంగాణకు ప్రథమ బహుమతి

తెలంగాణ మహిళా శక్తికి జాతీయ గుర్తింపు.. పీఎంఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్‌‌లో తెలంగాణకు ప్రథమ బహుమతి
  • బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్లో ఫస్ట్ రన్నరప్గా ఎంపిక
  • ఢిల్లీలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సెర్ప్ ఆఫీసర్లు
  • మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి సీతక్క
  • సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, సిబ్బందికి మంత్రి అభినందనలు

హైదరాబాద్, వెలుగు: మహిళా సాధికారత, గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. మహిళలను కేవలం పొదుపు సంఘాలకే పరిమితం చేయకుండా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌‌ప్రైజెస్’ (పీఎంఎఫ్​ఎంఈ) కింద స్వయం సహాయక సంఘాలకు సీడ్ క్యాపిటల్‌‌ను సమర్థవంతంగా అందించినందుకుగాను తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

అలాగే ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్' కింద ఫస్ట్ రన్నరగా అవార్డు దక్కించుకుంది. న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌‌లో నిర్వహించిన 'ఎంఓఎఫ్​పీఐ–పీఎంఎఫ్​ఎంఈ నేషనల్ కాన్‌‌క్లేవ్'లో కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలశాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా తెలంగాణ తరఫున సెర్ప్ సీఓఓ (ఫామ్​) ఎన్.రజిత ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు రావడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యుల శ్రమ, సెర్ప్ యంత్రాంగం నిబద్ధతకు దక్కిన ప్రతిఫలమని కొనియాడారు. మహిళలను కేవలం కుటుంబ ఆర్థిక వ్యవస్థకే కాకుండా, గ్రామీణ ఆర్థిక రంగాన్ని నడిపించే వ్యాపారవేత్తలుగా, ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దడమే ఇందిరా మహిళా శక్తి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పథకం అమలులో కీలకంగా వ్యవహరించిన సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, సీఓఓ ఎన్.రజితతోపాటు జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఆహార ప్రాసెసింగ్‌‌కు సీడ్ క్యాపిటల్ ఊతం
మహిళా సంఘాలు ఇప్పటికే నిర్వహిస్తున్న చిన్నతరహా ఆహార ఉత్పత్తుల వ్యాపారాలను మరింత విస్తరించుకునేందుకు సీడ్ క్యాపిటల్ ఉపయోగపడుతోందని మంత్రి తెలిపారు. ముడి సరుకుల కొనుగోలు, యంత్ర పరికరాలు, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం మహిళలకు ఆర్థికసాయం అందిస్తున్నామని వివరించారు.

పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తితో అనుసంధానం చేసి మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తున్నామని, తెలంగాణ మహిళలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే బ్రాండెడ్ ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.