లోక్‌సభ vs రాజ్యసభ: భారత రాజ్యాంగంలో ఉభయసభల సమాన అధికారాలు ఇవే !

లోక్‌సభ vs రాజ్యసభ: భారత రాజ్యాంగంలో ఉభయసభల సమాన అధికారాలు ఇవే !

భారత రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటులోని లోక్​సభ, రాజ్యసభల అధికారాల విషయంలో కొంత వైవిధ్యాన్ని ఏర్పర్చారు. కొన్ని అంశాల్లో రాజ్యసభకు ప్రత్యేకమైన అధికారాలు కల్పించగా, మరికొన్ని విషయాల్లో లోక్​సభకు ప్రత్యేకమైన అధికారాలు, ఆధిక్యతను కల్పించారు. అలాగే, ఉభయసభలకు సమానమైన ప్రాధాన్యతను కల్పించిన అంశాలు కూడా రాజ్యాంగంలో పొందుపర్చారు. 

రాజ్యాంగ సవరణ
భారత రాజ్యాంగాన్ని సవరించే సందర్భంలో పార్లమెంటులోని ఉభయసభలకు కూడా సమాన అధికారాలు ఉంటాయి. అంటే రెండు సభల ఆమోదంతోనే రాజ్యాంగాన్ని సవరించాలి. ఉభయసభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే ఆ బిల్లు వీగిపోతుంది. అంటే ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. 

ఉదాహరణకు పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 64వ సవరణ బిల్లు రాజీవ్ గాంధీ ప్రభుత్వకాలంలో (1989లో) లోక్​సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరించడం వల్ల ఆ బిల్లు వీగిపోయింది. 

అత్యవసర పరిస్థితులను ఆమోదించడం
352, 356, 360 అధికరణల ద్వారా రాష్ట్రపతి విధించే అత్యవసర పరిస్థితులను ఉభయసభలు కూడా ఆమోదించాలి. లేకపోతే అత్యవసర పరిస్థితి రద్దవుతుంది. 

ఉదాహరణకు బిహార్​లో 1999లో విధించిన రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని లోక్​సభ మాత్రమే ఆమోదించి రాజ్యసభ తిరస్కరించడం వల్ల ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. 

న్యాయ అధికారాలు
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, సీఏజీ, సీఈసీ మొదలైన వారిపై వచ్చే ఆరోపణలను విచారించి వారిని పదవి నుంచి తొలగించే సందర్భంలో ఉభయసభలకు కూడా సమాన అధికారాలు ఉంటాయి. అంటే ఏ ఒక్క సభ ఆమోదించకపోయి వారిని తొలగించే తీర్మానం వీగిపోయినట్లుగానే భావిస్తారు. 

ఎన్నిక అధికారాలు
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు సమాన అధికారాలు ఉంటాయి.

సాధారణ అధికారాలు
లోక్​సభలో పాలక, ప్రతిపక్షాల బలాబలాల మధ్య కొద్దిపాటి తేడా మాత్రమే ఉండి, రాజ్యసభలో పాలక, ప్రతిపక్షాల బలాబలాల మధ్య ఎక్కువ తేడా ఉన్న సందర్భంలో ఉభయసభల మధ్యన భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లయితే రాజ్యసభ నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది. అంటే రాజ్యసభలోని బలాబలాలే కీలక పాత్ర పోషిస్తాయి. 

సభాహక్కులు, జీతభత్యాలు
ఎంపీల హక్కుల విషయంలోనూ, జీతభత్యాల విషయంలోనూ ఉభయసభల సభ్యులకు కూడా సమానంగా అవకాశాలు ఉంటాయి. 

కేంద్ర మంత్రి మండలి విషయంలో
కేంద్ర మంత్రి మండలిలో పదవులను నిర్వహించే సందర్భంలో ఉభయసభల సభ్యులకు సమాన అవకాశాలు ఉంటాయి. 

రాజ్యాంగబద్ధ సంస్థల ఏర్పాటు
దేశంలో నూతన రాజ్యాంగబద్ధ సంస్థలను ఏర్పాటు చేయాలంటే మన రాజ్యాంగాన్ని సవరించాలి. అంటే పార్లమెంటులోని ఉభయసభల్లో 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించడం ద్వారా మాత్రమే నూతన సంస్థలను ఏర్పాటు చేయవచ్చు. ఏ ఒక్క సభ తిరస్కరించినా సంస్థల ఏర్పాటుకు అవకాశం లేదు. 

చట్టబద్ధ సంస్థల ఏర్పాటు
దేశంలో ఏవైనా చట్టబద్ధ సంస్థలను ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ ఉభయసభలు వేర్వేరుగా ప్రత్యేక చట్టాన్ని ఆమోదించడం ద్వారా మాత్రమే నూతన సంస్థల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. అంటే ఈ విషయంలో కూడా ఉభయసభలు సమానమైన అవకాశాలను కలిగి ఉంటాయి. 

పార్లమెంటరీ కమిటీల ఏర్పాటు
పార్లమెంట్ నుంచి ఏర్పాటయ్యే కమిటీల విషయంలో సభ్యులను కమిటీల్లోకి తీసుకునే సందర్భంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యుల సంఖ్యను ఆధారం చేసుకుని అదే నిష్పత్తిలో సభ్యులను ఆయా సభల నుంచి తీసుకుంటారు. విచారణ కమిటీలను ఏర్పాటు చేసే సందర్భంలో కూడా ఉభయసభల్లో సమానమైన అధికారాలను కలిగి ఉంటాయి. 

కమిటీల నివేదికలపై చర్చ
రాజ్యాంగబద్ధ సంస్థలైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కేంద్ర ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్​లతోపాటు ఇతర చట్టబద్ధ సంస్థలు సమర్పించే వార్షిక నివేదికలపై చర్చించి ఆమోదించే బాధ్యత కూడా పార్లమెంటుపై ఉంటుంది. అంటే ఈ సందర్భంలో ఉభయసభలు సమానమైన అధికారాలను కలిగి ఉంటాయి.