హైదరాబాద్‎లో మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్

 హైదరాబాద్‎లో మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్

హైదరాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జీవో 97 రద్దు చేయాలని  గురువారం (ఆగస్ట్ 27) వరంగల్ జిల్లాలో నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న హరీష్ రావును కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్భంధం చేశారు. 

ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం నడుస్తోందంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్లాలనివ్వాలని పోలీసులను కోరారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా అనుమతించలేమని పోలీసులు తెలిపారు. హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారని తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి తరలివెళ్లారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా హరీష్ రావు నివాసం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. 

పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఎందుకంటే..?

పాలిటెక్నిక్ కాలేజీల విభాగాన్ని శక్తి విభాగంలో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నం.97 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో 97 ద్వారా పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను శక్తి స్కీమ్ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మారనున్నాయి. శక్తి స్కీమ్ లో విలీనాన్ని పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తమ మూడేళ్ల డిప్లొమా విలువను, భవిష్యత్తును దెబ్బతీస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాలిటెక్నిక్ అనంతరం బీటెక్ సెకండియర్లో చేరే అవకాశం కోల్పోతామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.