భార్యను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారన్న కసితో ఓ భర్త చేసిన ప్రతీకారం ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. దిగ్గజ జాబ్ పోర్టల్ ‘ఇండీడ్’ సంస్థ 7 నెలల గర్భిణిగా ఉన్న తన భార్యను తొలగించడాన్ని ఆ వ్యక్తి జీర్ణించుకోలేకపోయాడు. ఫైనాన్షియల్ సేఫ్టీ, హెల్త్ ఇన్సూరెన్స్ కోల్పోయిన ఆ క్లిష్ట సమయంలో.. ఆ బాధను నిరాశగా మిగల్చకుండా సరికొత్త కక్ష సాధింపుగా మార్చుకున్నాడు. అదే ‘ఇండీడ్’కు గట్టి పోటీ ఇచ్చేలా స్వయంగా ఒక కొత్త జాబ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసి టెక్కీల దృష్టిని ఆకర్షించాడు.
టెక్ బ్యాగ్రౌండ్ లేకపోయినా AI అద్భుతాలను నమ్ముకుని ఇతను ఈ సాహసానికి పూనుకున్నాడు. ఆంత్రోపిక్ సంస్థకు చెందిన 'క్లౌడ్' ఏఐ కోడింగ్ టూల్స్ సహాయంతో కేవలం 4 నెలల్లోనే ఈ ప్లాట్‌ఫారమ్‌ను విజయవంతంగా రూపొందించాడు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి కంపెనీల కెరీర్ పేజీల నుంచి రోజుకు సుమారు 15వేల ఉద్యోగ ప్రకటనలను సేకరించి.. అభ్యర్థుల అర్హతలకు తగినట్లుగా మ్యాచ్ చేసేలా ఈ సిస్టమ్‌ను డిజైన్ చేశాడు.
ప్రస్తుతం ఈ స్టార్టప్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. కేవలం 4 నెలల్లోనే ఈ ప్లాట్‌ఫారమ్ 4వేల300 మందికి పైగా రిజిస్టర్డ్ యూజర్లు, 91 మంది పెయిడ్ సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు పలంటిర్, యాక్సెంచర్ వంటి దిగ్గజ కంపెనీలలో జాబ్స్ కూడా కొట్టారు. అంతేకాదు వర్క్‌డే, గ్రీన్‌హౌస్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఆటోమేటిక్‌గా అప్లికేషన్ ఫిల్ చేసే సరికొత్త ఫీచర్‌ను కూడా వీరు త్వరలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సక్సెస్ స్టోరీలో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏమిటంటే.. ఉద్యోగం కోల్పోయిన ఆ భార్యకు తర్వాతి కాలంలో ఏకంగా గూగుల్ కంపెనీలో మంచి జాబ్ వచ్చింది. అయినప్పటికీ భర్త మాత్రం తన పట్టు వదలలేదు. నా భార్యకు గూగుల్‌లో ఉద్యోగం వచ్చినా.. ఇండీడ్ సంస్థను మూయించే వరకు నా కసి తీరదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విభిన్నమైన ప్రయాణాన్ని చూసిన నెటిజన్లు దీనికి ‘రివెంజ్ వైబ్-కోడింగ్’ అని పేరు పెడుతూ అతనికి అండగా నిలుస్తున్నారు.
అన్ని అడ్డంకులను దాటుకుని ఒక వ్యక్తి తన కుటుంబంపై పడిన భారాన్ని.. పగను విజయవంతమైన బిజినెస్‌గా మార్చిన తీరు నిజంగా అభినందనీయం. దేవుడు నీకు బిలియన్ల డాలర్ల విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను అంటూ రెడ్ ఇట్ యూజర్లు ఈ రివెంజ్ స్టార్టప్‌కు సపోర్ట్ ప్రకటించారు. ఈ అద్భుతమైన ప్రయాణం ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
