సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను మించి సంపాదిస్తున్న బెంగళూరు పీజీ ఓనర్స్.. షాకింగ్ లెక్కలు

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను మించి సంపాదిస్తున్న బెంగళూరు పీజీ ఓనర్స్.. షాకింగ్ లెక్కలు

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా మారి కోట్లు సంపాదించాలనే కలల కంటే.. బెంగళూరులో పీజీలు, వాటర్ ట్యాంకర్లు నడపడమే అసలైన హైయెస్ట్ పేయింగ్ కెరీర్ అని ఓ టెక్ కామెంటర్ సాక్షి చేసిన వ్యంగ్యమైన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐఐటీలు, FAANG కంపెనీలు, కోడింగ్‌ల చుట్టూ తిరిగే యువతకు ఈ స్టోరీ ఒక వినూత్న ఆలోచనను ఇస్తోంది.

సాక్షి షేర్ చేసిన ఈ క్రేజీ లిస్ట్‌లో ఇంజనీరింగ్, మెడిసిన్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ వంటి సంప్రదాయ ఉద్యోగాలకు చోటు దక్కలేదు. నగరాల్లోని హౌసింగ్ సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటున్న పీజీ ఓనర్లు ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఒకే రూమ్‌లో ముగ్గురిని సర్దుబాటు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10వేల  నుంచి రూ.15వేలు వసూలు చేస్తూ.. రెంట్ పోను వీరు నెలకు లక్ష నుంచి ఒకటిన్నర లక్ష వరకు సంపాదిస్తున్నారని లెక్కలు బయటపెట్టారు ఆమె.

ఇక 2వ స్థానంలో టెక్ పార్కుల వద్ద ఉండే సిగరెట్, టీ స్టాల్ ఓనర్లు భారీగా సంపాదిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు0. ఎలాంటి పిచ్ డెక్, ఎంబీఏ, స్టార్టప్ ఫండింగ్ లేకుండా కేవలం చాయ్, స్నాక్స్ ద్వారా వీరు నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ఆర్జిస్తున్నారట. ఇక 3వ స్థానంలో బెంగళూరు ల్యాండ్‌లార్డ్స్ అదేనండి ఇంటి ఓనర్లు నిలిచారు. 2BHK ఫ్లాట్‌కు రూ.50వేలు అద్దె వసూలు చేయడం, ఏటా అద్దె పెంచడం, వాట్సాప్‌లో "లాస్ట్ ప్రైస్" అని మెసేజ్ చేయడం వీళ్ల ప్రత్యేకతని పోస్ట్‌లో ఎద్దేవా చేశారు సాక్షి.

ఈ లిస్టులో నగర వాటర్ ట్యాంకర్ ఓనర్లు, బ్రోకర్లు కూడా చోటు దక్కించుకున్నారు. నీటి కొరత సమయంలో బెంగళూరు నీళ్లను బెంగళూరు ప్రజలకే అమ్ముతూ ట్యాంకర్ ఓనర్లు హవా నడిపిస్తుంటే.. సరిపోని ఇళ్లను చూపించి అటు ఓనర్, ఇటు టెనెంట్ నుంచి ఒక నెల బ్రోకరేజ్ వసూలు చేస్తున్నారు బ్రోకర్లు అందరూ హ్యాపీగానే సంపాదించుకుంటున్నారని సాక్షి అన్నారు. 

అసలైన ట్విస్ట్ ఏమిటంటే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మాత్రం రాత్రి 2 గంటలకు కూడా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ జీతాలు ఎప్పుడు పెంచుతారా ఎదురుచూస్తున్నారని పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఎక్స్ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. సాఫ్ట్‌వేర్ కంటే చాయ్, ప్రాపర్టీ, ట్యాంకర్లే బెటర్ అని.. ట్యాంకర్ కొనుక్కోవాల్సింది అంటూ యూజర్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.