- ఈ నెలాఖరులోపు డీపీఆర్ రెడీ చేయాలని ఆదేశాలు
- పూర్తయితే టేల్ ఎండ్ వరకు సాగు నీరు
- మరో 10 వేల ఎకరాల ఆయకట్టు పెరిగే చాన్స్
పెద్దపల్లి, వెలుగు: పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఇటీవల ఈ రిజర్వాయర్ నిర్మాణంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో అధికారులతో రివ్యూ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిధిలో నిర్మించనున్న రిజర్వాయర్‌కు ఈ నెలాఖరులోపు డీపీఆర్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. సీడబ్ల్యూసీ రూల్స్‌కు అనుగుణంగా డీపీఆర్ఉండాలని ఆదేశించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు టేల్ ఎండ్‌లో మరో 10 వేల వరకు పెరిగే చాన్స్ ఉంది. గత సర్కార్కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని పెద్దపల్లి జిల్లాలోని ఎస్సారెస్సీ కింద ఉన్న ఆయకట్టు భూములకు అందించాలన్న ఆలోచనతో రిజర్వాయర్ నిర్మాణం చేయాలనుకుంది.
ఇందుకు ధర్మారం మండలం పత్తిపాక వద్ద రిజర్వాయర్ నిర్మించాలని ప్లాన్ చేసింది. తొలుత 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత 5 టీఎంసీలు, 7 టీఎంసీలకు పెంచారు. కానీ ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ రిజర్వాయర్ మూలన పడిపోయింది. కాగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటయ్యాక ఎన్నికల హామీలో భాగంగా మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు.. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి పత్తిపాకపై క్లియరెన్స్తీసుకున్నారు.
అనంతరం మంత్రితో కలిసి ఎమ్మెల్యేలు, అధికారులు రిజర్వాయర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం బోర్‌హోల్ డ్రిల్లింగ్, ట్రయల్ ఫిట్స్, జియో టెక్నికల్ టెస్టింగ్స్జరుగుతున్నాయి. రిజర్వాయర్ పూర్తయితే పెద్దపల్లి జిల్లాలోని 2.40 లక్షల ఎకరాలతో పాటు, జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్, కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో 40 వేల ఎకరాలపైగా ఆయకట్టు స్థిరీకరణ కానుంది. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి, మంథని, రామగుండం మండలాల్లోని టేల్‌ఎండ్ పరిధిలో మరో 10 వేల ఎకరాల సాగు పెరిగే చాన్స్ ఉంది. దీంతోపాటు కాకతీయ ప్రధాన కాలువకు చెందిన డీ83, డీ94 వరకు ప్రయోజనం కలుగుతుంది.
