ఆగస్టు 20న తమిళనాడులోని మహాబలిపురం కోవలంలో జరిగిన 31వ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం భారత సమాఖ్య వ్యవస్థపై మరోసారి జాతీయ చర్చకు కేంద్రబిందువైంది. రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, కేంద్ర పన్నుల వాటా, మౌలిక సదుపాయాలు, విద్య, పెట్టుబడులు, కేంద్ర– రాష్ట్ర సంబంధాలు వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది.
అనంతరం కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని ప్రకటించింది. అయితే ఈ హామీలు సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసే విధానపరమైన సంకల్పానికి నిదర్శనమా..? లేక రాజకీయ అవసరాలకు అనుగుణంగా చేసిన ప్రకటనలా..? అనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తోంది. భారతదేశం ఒకే రాజ్యాంగం, ఒకే సార్వభౌమత్వం కలిగిన దేశమైనప్పటికీ, దాని పరిపాలనా నిర్మాణం సమాఖ్య సూత్రాలపై ఆధారపడి ఉంది.
రాజ్యాంగం కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించి పరస్పర సమతుల్యతను నెలకొల్పే ప్రయత్నం చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బలమైన కేంద్రాన్ని సమర్థించినప్పటికీ, రాష్ట్రాల రాజ్యాంగబద్ధ హక్కులు, స్వయంప్రతిపత్తి ప్రజాస్వామ్య వ్యవస్థకు అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. అందువల్ల కేంద్ర–రాష్ట్ర సంబంధాలను రాజకీయ కోణంలో మాత్రమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తి, సమాఖ్య విలువల దృష్టితో విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
ఆర్థిక వివక్ష
దక్షిణాది రాష్ట్రాల ప్రధాన ఆందోళన ఆర్థిక సమాఖ్యకు సంబంధించినది. దేశ జీడీపీ, పారిశ్రామిక ఉత్పత్తి, ఐటీ, సేవారంగం, ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో ఈ రాష్ట్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల తాము కేంద్రానికి సమకూర్చే ఆదాయానికి అనుగుణంగా నిధులు, మౌలిక వసతులు, జాతీయ సంస్థలు, పెట్టుబడులు రావడం లేదని అవి వాదిస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు అధిక వనరులు కేటాయించడం రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొంటోంది.
వాస్తవానికి ఈ రెండు వాదనల మధ్య సమతుల్యతే భారత సమాఖ్య వ్యవస్థ ముందున్న ప్రధాన సవాలు. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాల సామర్థ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు, వెనుకబడిన ప్రాంతాలను ముందుకు తీసుకురావడం కూడా సమాఖ్య వ్యవస్థ లక్ష్యమే. ఇటీవలి కాలంలో ఈ చర్చకు మరింత పదును పెట్టిన అంశం నీట్ పరీక్ష. పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాలు, పారదర్శకతపై వచ్చిన సందేహాలు కేంద్ర పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తాయి. తమిళనాడు ప్రభుత్వం సహా కొన్ని రాష్ట్రాలు వైద్య ప్రవేశాల నిర్వహణలో రాష్ట్రాలకు ఎక్కువ స్వేచ్ఛ ఉండాలని, స్థానిక విద్యా విధానం, భాషా నేపథ్యం, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాయి.
మరోవైపు, దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణం ద్వారా నాణ్యమైన వైద్య విద్య, సమాన అవకాశాలు, పారదర్శక ప్రవేశ విధానాన్ని నిర్ధారించడమే నీట్ లక్ష్యమని కేంద్రం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ప్రశ్న నీట్ ఉండాలా లేదా అనేదికాదు. జాతీయ ప్రమాణాలు కొనసాగుతూనే రాష్ట్రాల ప్రత్యేక అవసరాలు, సామాజిక వాస్తవాలకు ఎంతమేరకు గౌరవం లభిస్తోందనేదే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
త్రిభాషా సూత్రం
భాషా విధానం కూడా కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో సున్నితమైన అంశంగానే కొనసాగుతోంది. త్రిభాషా సూత్రం జాతీయ ఐక్యత లక్ష్యంతో రూపొందించినప్పటికీ, హిందీ విధింపుపై ముఖ్యంగా తమిళనాడులో దశాబ్దాలుగా వ్యతిరేకత కొనసాగుతోంది. భారతదేశం బహుభాషా, బహుళ సాంస్కృతిక దేశం. కాబట్టి భాషా వైవిధ్యాన్ని గౌరవించే విధానాలే సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తాయి. ఒక భాషకు ప్రాధాన్యం ఇవ్వడం, ఇతర భాషల పట్ల అనుమానాలకు దారితీయకుండా సమతుల్య విధానం అవసరం. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై సర్కారియా కమిషన్ చేసిన సిఫార్సులు నేటికీ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.
బలమైన కేంద్రం అవసరమే అయినప్పటికీ, అది రాష్ట్రాల అధికారాలను కుదించే విధంగా కాకుండా, సంప్రదింపులు, పరస్పర విశ్వాసం, సహకారంతో పనిచేయాలని కమిషన్ స్పష్టం చేసింది. అనంతరం వచ్చిన ఫుంచీ కమిషన్ కూడా గవర్నర్ల పాత్ర, అంతర్రాష్ట్ర మండలి, అధికార వికేంద్రీకరణ వంటి అంశాల్లో సంస్కరణలను సూచించింది. ఈ రెండు కమిషన్ల నివేదికలు సమాఖ్య వ్యవస్థలో ‘ఆధిపత్యం’ కంటే ‘సహకారం’ ముఖ్యమని గుర్తుచేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగబద్ధ అధికారాలను గౌరవించాలి
సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో సమాఖ్య వ్యవస్థను రాజ్యాంగపు మౌలిక నిర్మాణంలో భాగంగా గుర్తించింది. ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1994) కేసులో రాష్ట్ర ప్రభుత్వాలను రాజకీయ కారణాలతో అస్థిరపరచడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఇటీవలి గవర్నర్ల అధికారాలకు సంబంధించిన తీర్పుల్లో కూడా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగబద్ధ అధికారాలను గౌరవించాలని న్యాయస్థానం పునరుద్ఘాటించింది. ఈ తీర్పులు సమాఖ్య వ్యవస్థ కేవలం పరిపాలనా ఏర్పాటు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర అధికారాల కేంద్రీకరణపై కూడా చర్చ పెరిగింది. గవర్నర్ల పాత్ర, కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగం, జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛ తగ్గిందని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఈ పరిణామాలను సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం జాతీయ సమన్వయం, పరిపాలనా సామర్థ్యం, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని విధానాల్లో ఏకరూపత అవసరమని వాదిస్తోంది. ఈ రెండు వాదనలను రాజకీయ భావోద్వేగాల కంటే రాజ్యాంగం, గణాంకాలు, సంస్థాగత అనుభవాల ఆధారంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
‘సహకార సమాఖ్య’కు అత్యుత్తమం భారత రాజ్యాంగం
రాజ్యాంగ చరిత్రకారుడు గ్రాన్‌విల్ ఆస్టిన్ భారత రాజ్యాంగాన్ని ‘సహకార సమాఖ్య’కు ప్రపంచంలోనే అత్యుత్తమ ఉదాహరణగా అభివర్ణించారు. ఆయన అభిప్రాయం ప్రకారం కేంద్రం, రాష్ట్రాలు పరస్పర ప్రత్యర్థులు కాదు. ప్రజా సంక్షేమం కోసం భాగస్వాములు. అదే భావన నేటి కేంద్ర – రాష్ట్ర సంబంధాలకు కూడా మార్గదర్శకంగా ఉండాలి. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కేవలం ప్రాంతీయ రాజకీయాలుగా కొట్టిపారేయడం చిత్రీకరించడం సరికాదు.
సమాఖ్య వ్యవస్థలో విశ్వాసం మాటలతో కాదు. విధానాలతో, బడ్జెట్ కేటాయింపులతో, రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవంతో, రాష్ట్రాల అభిప్రాయాలకు ఇచ్చే ప్రాధాన్యంతో బలపడుతుంది. కేంద్రం ‘పెద్దన్న’ పాత్రలో కాకుండా ‘సమన్వయకర్త’గా వ్యవహరించినప్పుడే రాజ్యాంగం ఆశించిన సహకార సమాఖ్య స్ఫూర్తి సాకారమవుతుంది.
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న ప్రేమ నిజమైనదా, రాజకీయ వ్యూహమా అనే ప్రశ్నకు సమాధానం ప్రకటనల్లో కాదు, ఆచరణలో ఉంది. పారదర్శక ఆర్థిక పంపిణీ, రాష్ట్రాల రాజ్యాంగబద్ధ హక్కుల పట్ల గౌరవం, విధాన నిర్ణయాల్లో సంప్రదింపులు, సమాఖ్య సంస్థలను బలోపేతం చేయడం వంటి చర్యలు కనిపించినప్పుడే ఆ ప్రేమ విశ్వసనీయతను పొందుతుంది. భారత ప్రజాస్వామ్య బలం కేంద్రం లేదా రాష్ట్రాల ఆధిపత్యంలో కాదు. రాజ్యాంగ నిబద్ధత, పరస్పర విశ్వాసం, సహకార సమాఖ్య స్ఫూర్తిలోనే ఉంది.
- ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
