- ఆన్ లైన్లో బుక్ చేసి.. డెలివరీ కోసం సోదరుల అడ్రస్ ఇస్తే చాలు..
- హైదరాబాద్ నగరంలో నిమిషాల్లో.. మిగతా పట్టణాల్లో 24 గంటల్లోనే డెలివరీ
హనుమకొండకు చెందిన రాధిక సికింద్రాబాద్‍లోని తన సోదరులకు రాఖీలు పంపేందుకు ఓ కొరియర్ సంస్థకు వెళ్లింది. మాములు సమయాల్లో రూ.50 వసూలు చేసే చార్జీని.. రాఖీ ఎక్స్ ప్రెస్ తో రూ.300కు పెంచారు. అవి చేరడానికి రెండు రోజులు పడుతుందన్నారు. దీంతో ఆన్ లైన్ యాప్ లో రాఖీలు బుక్ చేసి.. డెలివరీ కోసం సికింద్రాబాద్ లోని తన సోదరుడి ఇంటి అడ్రస్ ఇచ్చింది. ఇంకేముంది.. గంటల వ్యవధిలోనే రాఖీలు వారి ఇంటికి చేరాయి.
వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన రమాదేవి హైదరాబాద్‍లో ఉండే తన సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్లడం వీలు కాలేదు. దీంతో హైదరాబాద్‍లోని తన ఫ్రెండ్ సాయంతో ఆన్ లైన్ లో రాఖీలను కొని.. తన సోదరుడి అడ్రస్ ఇచ్చింది. కేవలం 15 నిమిషాల్లోనే ఆ రాఖీలు రమాదేవి అన్న ఇంటికి చేరాయి.
వరంగల్, వెలుగు: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఆన్‌లైన్ యాప్‌లు మరింత దగ్గర చేస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి రీత్యా దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదరులకు రాఖీలు కట్టేందుకు వెళ్లలేని అక్కాచెల్లెళ్ల కోసం ఆన్‌లైన్ యాప్ సర్వీస్ లు అందుబాటులోకి వచ్చాయి. ఆన్ లైన్ లో రాఖీలు బుక్ చేసి.. తాము ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వారి ఇంటి అడ్రస్ ఇస్తే చాలు.. గంటల వ్యవధిలోనే డెలివరీ చేస్తున్నాయి.
లోకల్ అయితే నిమిషాల్లో.. నాన్ లోకల్ అయితే గంటల్లో...
కస్టమర్లు ఆర్డర్ పెట్టే వస్తువులను త్వరగా డెలివరీ చేసేందుకు వివిధ ఆన్ లైన్ సంస్థలు పోటీ పడుతున్నాయి. హైదరాబాద్‍లో ఏ మూలనుంచి ఏ మూలకైనా రాఖీలను 10 నుంచి 15 నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అదే వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నల్గొండ వంటి ఇతర జిల్లాల నుంచి పంపిస్తే అడ్రస్ ఆధారంగా 24 గంటల్లో చేరేలా సేవలు అందిస్తున్నాయి.
రాఖీలతో పాటు సంప్రదాయబద్ధంగా దీవెనల కోసం బొట్టు, అక్షితలు, నోరు తీపి చేసేందుకు ఖరీదైన చాక్లెట్లు, డ్రైఫూట్స్, స్వీట్లు సైతం పంపేలా ‘రాఖీ గిఫ్ట్ బాక్స్’లను ఆన్‍లైన్‍లో అందుబాటులోకి తెచ్చారు.
తగ్గిన ఖర్చు.. సమయం ఆదా
దూర ప్రాంతాల్లో ఉండే తమ సోదరులకు రాఖీ కట్టలేని పరిస్థితుల్లో వారికి పండుగ సమయానికి ముందు రాఖీలు చేరవేయడమంటే గతంలో పెద్ద టాస్క్ అయ్యేది. వారం ముందే రాఖీలు కొనుగోలు చేయడమే కాకుండా వాటిని ప్యాక్ చేయించాల్సి వచ్చేది.
తర్వాత కొరియర్ సెంటర్ల వద్దకు వెళ్తే.. వారు స్పెషల్ సర్వీస్ పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేసేవారు. దీంతో రాఖీలు కొనడం మొదలుకొని వాటిని కొరియర్ చేసే వరకు రూ.700 నుంచి రూ.1000 ఖర్చు చేయాల్సి వచ్చేది.
ఇంతచేసినా ఏదైనా కారణం వల్ల పండుగ సమయానికి రాఖీలు చేరకపోతే ఇటు పంపినవారు, అటు తీసుకోవాల్సిన వారు బాధపడేవారు. కానీ ప్రస్తుతం ఆన్‍లైన్‍లో రాఖీల కొనుగోలుతో పాటు వాటిని సోదరుల ఇంటి అడ్రస్‍కు చేర్చడానికి తక్కువ ఖర్చు కావడంతో పాటు, సమయం సైతం ఆదా అవుతోంది.
