త్రిభాషా విధానంపై సుప్రీం డైరెక్షన్

త్రిభాషా విధానంపై సుప్రీం డైరెక్షన్

పాఠశాల విద్యలో త్రిభాషా విధానం అమలుపై సుప్రీంకోర్టు ఆగస్టు మూడో వారంలో భాషల అభ్యసన గురించి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వాకం గురించి మరోసారి వ్యాఖ్యానం చేయడం గమనార్హం! ఈసారి ఆరో తరగతికి  త్రిభాషా నియమంలో సడలింపు ఇవ్వాలని సీబీఎస్ఈకి సూచించింది. ఈ వ్యాఖ్యలు విద్యాహక్కు చట్టం ప్రకారం అకడమిక్ అథారిటీగా ఉన్న ఎన్సీఈఆర్టీ,  సీబీఎస్ఈల పని విధానాన్ని, క్షేత్రస్థాయిలో అకడమిక్ విషయాల అమలులో అవగాహన లేమితనాన్ని సూచిస్తున్నాయి.

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, ఉత్తమ మానవ వనరులుగా రూపొందడానికి కావలసినవిధంగా మార్గదర్శనం చేసే ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈలకు రాజకీయ గ్రహణం పట్టి, పాలకుల ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలను రూపొందించడం వల్ల అకడమిక్ వ్యవహారాల్లో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. 

 7 నుంచి 9 తరగతుల విద్యార్థులకు మినహాయింపు

మే 15న  సీబీఎస్ఈ జారీ చేసిన  సర్క్యులర్ ప్రకారం ఇప్పటికే  విదేశీ భాషలు చదువుతున్నవారితో సహా జులై 2026 నుంచి 6వ తరగతి,  9వ తరగతి విద్యార్థులందరూ మూడు భాషలు చదవాలి.  వాటిలో రెండు తప్పనిసరిగా భారతీయ భాషలే కావాలి.   విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత  సీబీఎస్ఈ  త్రిభాషా విధానం అమలు చేయాలని సర్క్యులర్  జారీచేసిన దరిమిలా బాధిత విద్యార్థులు న్యాయస్థానాన్ని  ఆశ్రయించారు. 

గత జూన్‌లో న్యాయస్థానం జోక్యంతో  సీబీఎస్ఈ  మార్గదర్శకాలను సవరించి 7 నుంచి 9 తరగతుల విద్యార్థులకు మినహాయింపు ఇచ్చారు.  కానీ,  ప్రస్తుత ఆరో తరగతి బ్యాచ్‌‌‌‌కు మాత్రం పూర్తిస్థాయిలో అమలుచేయాలని తెలిపింది. 2031 నాటికి పదో తరగతి బోర్డు పరీక్షలో మూడో భాష తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది.  ప్రస్తుత వివాదం అదే!

సంస్కృతికి వాహనం భాష 

 త్రిభాషా విధానం ప్రకారం విద్యార్థులు కనీసం రెండు స్వదేశీ భారతీయ భాషలు చదవాలి. దీంతో వారికి ఒకే ఒక విదేశీ భాషకు అవకాశం ఉంటుంది. దాదాపు అందరూ ఆ ఒక్క స్లాట్‌‌‌‌లో ఇంగ్లిష్‌‌‌‌నే ఎంచుకుంటారు. ఫలితంగా ఫ్రెంచ్, జపనీస్ వంటి ఇతర విదేశీ భాషలు ప్రధాన పాఠ్యాంశాల నుంచి తొలగిపోతాయి.  మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాల పిల్లలు  గతంలో విదేశీ భాషలు అభ్యసించి ఉద్యోగాలు పొందేవారు.

 తాజాగా చేసిన మార్పుతో ఈ అవకాశం లేకుండాపోతోంది. అనంతరం త్రిభాషా విధానాన్ని కింది తరగతుల నుంచి దశలవారీగా అమలు చేయాలని,  తద్వారా విద్యార్థులకు,  తల్లిదండ్రులకు, పాఠశాలలకు ‘కొంత వెసులుబాటు’ ఇవ్వాలని కోర్టు  సూచించింది. త్రిభాషా విధానం కింద వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఉన్న పాఠ్యపుస్తకాలు నేరుగా సంయుక్త వాక్యాలతో ప్రారంభమవుతున్నాయి.

ఉదాహరణకు సంస్కృతం నేర్చుకోవాలంటే  మొదటి అక్షరం నుంచి నేర్చుకోవాలి.  కానీ  వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లోని పుస్తకాల్లో  సంయుక్త వాక్యాలు ఉన్నాయి.  ఇంగ్లిష్‌‌‌‌ను ఏవిధంగానూ విదేశీ భాషగా  పరిగణించలేమని  ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ‘ఇంగ్లిష్ రాజ్యాంగం ప్రకారం అధికారిక భాష.  దీన్ని విదేశీ భాషగా పరిగణించకపోయినా, ఇది స్వదేశీ భాష కూడా కాదు. భాష అనేది సంస్కృతికి వాహనం’ అని ప్రభుత్వం వాదించింది. 

ఈక్షేత్రస్థాయి వాస్తవాలను పట్టించుకోవాలి

విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిషు, హిందీ (మూడు భాషలు) అందిస్తున్నారు. అందులో కనీసం రెండు దేశీయ భాషలు అందిస్తున్నారు. ఇది జాతీయ విద్యా విధానం ప్రతిపాదన ప్రకారమే ఉంది. ఇక  తెలుగు రాష్ట్రాల్లో  ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు బోధించరు. ఆంగ్లం, హిందీ, సంస్కృతం బోధిస్తారు.  మూడు భాషల విధానం అనేది సమతుల్యత సాధించే ప్రయత్నంగానే మొదటినుంచీ ప్రచారం జరుగుతున్నది. కానీ ప్రస్తుతం అది రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మారుతున్నది. 

 సీబీఎస్ఈ,  కేంద్రం కలిసి విద్యను ఒక ప్రయోగశాలగా మార్చుతున్నాయనే విమర్శలు తోసిపుచ్చదగ్గవేమీ కాదు. ప్రాథమిక సమస్యలు పరిష్కరించకుండా మూడో భాషను తప్పనిసరి చేయడం విద్యార్థులపై ప్రయోగాలు చేయడం తప్ప మరొకటి కాదు. విధాన రూపకల్పనలో క్షేత్రస్థాయి వాస్తవాలను పట్టించుకోవాలి. సీబీఎస్ఈ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయాలనే పట్టుదల భారత సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తుంది.

- కె. వేణుగోపాల్
విద్యారంగ విశ్లేషకుడు

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.