తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధారి’. కనిక ధిల్లాన్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహించారు. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైన్ జర్నీలో తన కూతురును ఎవరో కిడ్నాప్ చేయగా, వాళ్లను వెంబడించే క్రమంలో ప్రమాదవశాత్తు చూపు కోల్పోతుంది తాప్సీ. ఆ నెలలో అది మూడో కిడ్నాప్ కావడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. అసలు ఎవరు ఈ కిడ్నాప్‌లు చేస్తున్నారు, అంధురాలైన ఆమె ఆ చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా నుంచి తన కూతురును కాపాడుకునేందుకు ఏం చేసింది అనేది మెయిన్ కాన్సెప్ట్.
మదర్ సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘కృష్ణుడు మరోసారి గాంధారిని పరీక్షించాడు.. కానీ ఈ మహాసంగ్రామంలో స్వయంగా గాంధారినే యుద్ధ రంగంలోకి అడుగుపెట్టబోతోంది’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇష్వాక్ సింగ్, జతిన్ సర్నా పోలీస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో స్వస్తిక ముఖర్జీ, మితా వశిష్ట్, ఛాయా కదం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా సెప్టెంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
