ధన్వాడ, వెలుగు: నారాయణపేట జిల్లా ధన్వాడకు చెందిన బాలిక(17)ను కిడ్నాప్ చేసి పెండ్లి చేసుకోబోతుండగా, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తన కూతురు కిడ్నాప్‌కు గురైనట్లు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో నన్నువాడుకు చెందిన ఓ యువకుడు బాలికను తీసుకెళ్లి బండారుపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకోబోతుండగా, పోలీసులు అక్కడికి చేరుకొని పసుపు బట్టలతోనే వారిద్దరిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు.
దీంతో బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ వద్ద బాలిక, యువకుడి తరపు వారు పెద్ద సంఖ్యలో గుమిగుడారు. అమ్మాయి మైనర్ కాదని, ఇంట్లో నుంచి బయటకు వచ్చిందని యువకుడి తరపు వారు చెబుతున్నారు. 20 రోజుల కిందటే పోలీసులను కలిసి రక్షణ కల్పించాలని వేడుకుందని పేర్కొన్నారు. మైనారిటీ తీరిందా? లేదా? అనే విషయాన్ని తేల్చేందుకు సమయం పడుతుందని, అప్పటి వరకు అమ్మాయిని జిల్లా కేంద్రంలోని స్టే హోంలో ఉంచుతామని పోలీసులు తెలిపారు.
