పాట్నా: బీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళన పాట్నాలో ఉద్రిక్తంగా మారింది. మంగళవారం సీఎం నివాసం వైపు కదిలిన నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కెనాన్లు, లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు, పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో పునైచక్ ప్రాంతానికి చెందిన ఆరేండ్ల ఆదిత్య అందరి దృష్టిని ఆకర్షించాడు. టీషర్ట్, డెనిమ్ ప్యాంట్ వేసుకుని, నుదుట తిలకంతో నిరసనలో పాల్గొన్నాడు. మీడియాతో మాట్లాడిన ఆదిత్య.. “బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి రాజీనామా చేయాలి. లాఠీచార్జ్‌కు ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలి” అంటూ కామెంట్స్ చేశాడు.
తాను భవిష్యత్తు గురించి ఆలోచించే పౌరుడిగా తన హక్కులను వినియోగించుకుంటున్నానని చెప్పాడు. దీంతో ఆ చిన్నోడు నిరసనలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారాడు. నిరసనలో పాల్గొన్నందుకు ఆదిత్యను పోలీసులు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. బాలుడిని అరెస్ట్ చేయలేదని, నిరసనలో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో అతడి భద్రత కోసమే కాసేపు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ కౌన్సెలింగ్ ఇచ్చి తల్లికి అప్పగించామని తెలిపారు. ఆదిత్యను స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చే సమ యంలో నిరసనకారులు ‘జెన్ ఆల్ఫా’ అంటూ నినాదా లు చేశారు.
