ఏ నిర్ణయం రాకముందే నీటిని తీస్కపోతరా?..మన అధీనంలోని సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లే ధైర్యం ఏపీకి ఎక్కడిది?: ఎమ్మెల్యే హరీశ్ రావు

ఏ నిర్ణయం రాకముందే నీటిని తీస్కపోతరా?..మన అధీనంలోని సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లే ధైర్యం ఏపీకి ఎక్కడిది?: ఎమ్మెల్యే హరీశ్ రావు
  •     ఆ రాష్ట్రాన్ని అడ్డుకోవాల్సిన కృష్ణా బోర్డు ఏం చేస్తోందని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అధీనంలో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కృష్ణా రివర్‌‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(కేఆర్ఎంబీ) అనుమతులు లేకుండానే కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని దౌర్జన్యంగా విడుదల చేసుకున్నదని బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఏపీ 47 టీఎంసీల నీటిని కోరితే.. దానిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడిందని, కేటాయింపులపై నిర్ణయం రాకముందే ఆ రాష్ట్ర అధికారులు నీటిని తరలించడం ఏమిటని ప్రశ్నించారు. కృష్ణా బోర్డు అనుమతులు లేకుండా నీటిని తీసుకెళ్లేంత ధైర్యం ఏపీకి ఎలా వచ్చిందని బుధవారం ఒక ప్రకటనలో నిలదీశారు. ఏపీని అడ్డుకోవాల్సిన కృష్ణా బోర్డు ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. ‘‘ఒకవైపు శ్రీశైలం నుంచి వెలిగొండ టన్నెల్ ద్వారా 11 టీఎంసీల నీటిని తరలించబోతున్నారు. ఇప్పుడు సాగర్ కుడి కాల్వ నుంచి  ఎలాంటి అనుమతులు లేకుండా నీటిని తరలిస్తున్నారు. 

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇలా ఇష్టారీతిన నీటిని తరలించడం దుర్మార్గం. ఇప్పటికే గత రెండేండ్లుగా కృష్ణా జలాల్లో తాత్కాలిక వాటాను సైతం వినియోగించుకోలేక మన నీళ్లను ఏపీకి ధారాదత్తం చేశారు. ఈ ఏడాది కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను కాపాడాల్సిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ నీటి తరలింపును అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారు. సీఎం మౌనం తెలంగాణ తాగు, సాగు నీటి ప్రయోజనాలకు శాపంగా మారుతోంది. ఏపీ నీటి అక్రమ తరలింపు విషయంలో కృష్ణా బోర్డుపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.

నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలి

కూకట్​పల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిన ప్రజల భూములను వెంటనే 22ఏ సెక్షన్‌‌‌‌ నుంచి తొలగించాలని హరీశ్‌‌‌‌రావు డిమాండ్‌‌‌‌ చేశారు. కూకట్‌‌‌‌పల్లి ప్రజల భూములను నిషేధిత నుంచి తొలగించాలని, హౌసింగ్‌‌‌‌ బోర్డు భూముల అమ్మకాలు ఆపాలన్నారు.