త్వరలో రూ.10 లక్షల కోట్లకు SBI హోమ్లోన్లు.. 28 శాతం వాటాతో మార్కెట్ లీడర్‌‌‌‌

త్వరలో రూ.10 లక్షల కోట్లకు SBI హోమ్లోన్లు.. 28 శాతం వాటాతో మార్కెట్ లీడర్‌‌‌‌

న్యూఢిల్లీ: ఎస్‌‌‌‌బీఐ త్వరలో హోమ్‌‌‌‌ లోన్ల విభాగంలో కొత్త మైలురాయిని అందుకోనుంది. ఇప్పటికే రూ.9 లక్షల కోట్లకు పైగా రుణాలు ఇచ్చిన ఈ సంస్థ, ప్రస్తుత క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోనే రూ.10 లక్షల కోట్ల మార్క్‌‌‌‌ను అందుకుంటామని ప్రకటించింది. ప్రస్తుతం భారత హోమ్ లోన్ సెగ్మెంట్‌‌‌‌లో 28 శాతం వాటాతో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నామని సంస్థ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి అన్నారు. దేశవ్యాప్తంగా 460కి పైగా ప్రత్యేక హోమ్ లోన్ ప్రాసెసింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్నామని, వడ్డీ రేట్లలో పారదర్శకత, డాక్యుమెంటేషన్ ప్రక్రియలో కచ్చితత్వం, బిల్డర్ల ప్రాజెక్టులపై బ్యాంక్ నిర్వహించే పకడ్బందీ చట్టపరమైన పరిశీలన వంటివి కస్టమర్లలో ఎస్‌‌‌‌బీఐ పట్ల నమ్మకాన్ని పెంచాయని తెలిపారు. 

సెక్యురిటైజేషన్‌‌పై పైలట్ ప్రాజెక్ట్‌‌

సెక్యురిటైజేషన్ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ రంగంలో దాదాపు రూ.30 లక్షల కోట్లకు పైగా హోమ్‌‌‌‌ లోన్ల ఔట్‌‌‌‌స్టాండింగ్ (బకాయి)  విలువ ఉందని, సరైన లిక్విడిటీ లేక వీటిని సెక్యురిటైజేషన్  చేయలేకపోతున్నామని తెలిపారు. సెక్యురిటైజేషన్ అంటే ఒక సంస్థ తమ హోమ్ లోన్లను ఒక పూల్‌‌‌‌గా చేసి ఇన్వెస్టర్లకు అమ్మడం. దీంతో సంస్థకు క్యాపిటల్ అందుతుంది. దీనిని తిరిగి లోన్లను ఇవ్వడానికి వాడుకోవచ్చు. 

ఇన్వెస్టర్లకు కస్టమర్లు చెల్లించే హోమ్ లోన్ల వడ్డీ, అసలు అందుతుంది.  బ్యాంకులే ఈ లోన్లను వసూలు చేస్తాయి. కానీ, కొంత పర్సంటేజ్ కమిషన్ తీసుకుంటాయి. మిగిలినది ఇన్వెస్టర్లకు చెల్లిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారత్‌‌‌‌లో మార్ట్‌‌‌‌గేజ్ ఆస్తుల సెక్యూరిటైజేషన్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది.  

సెక్యూరిటైజేషన్ విధానాన్ని అభివృద్ధి చేస్తున్నామని,  బ్యాంకింగేతర సంస్థలు, ఇన్వెస్టర్లతో కలిసి ఈ ఏడాదిలోనే ఒక పైలట్ ట్రాన్సాక్షన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని శెట్టి వెల్లడించారు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కన్సెషన్  ఫారెక్స్ స్వాప్ విండో  కింద 10 బిలియన్ డాలర్ల నిధులను సేకరిస్తామని శెట్టి అన్నారు.