న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను తగ్గించాలని చూస్తోంది. పన్ను ఎక్కువ కావడంతో కొంతమంది వీటిని దొడ్డిదారిన దిగుమతి చేసుకొని, లోకల్‌గా అమ్మడమే ఇందుకు కారణం. బ్లాక్ మార్కెట్ ద్వారా భారీగా డాలర్లు బయటకు వెళ్తున్నాయని అంచనా. డాలర్ నిల్వలను కాపాడేందుకు ప్రభుత్వం విధించిన ప్రస్తుత 15 శాతం దిగుమతి సుంకాన్ని 6 శాతానికి తగ్గించాలని బులియన్ వ్యాపారులు, ఆభరణాల తయారీదారులు కేంద్రాన్ని కోరుతున్నారు.
పన్నులు తగ్గితే అధికారిక దిగుమతులకు, స్మగ్లింగ్ బంగారానికి మధ్య ధరల వ్యత్యాసం తగ్గి, అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. రూపాయి విలువ పతనం, కరెంట్ ఖాతా లోటును నియంత్రించేందుకు సుంకాలు పెంచినప్పటికీ, జూన్–జులైలో బంగారం దిగుమతులు 5.5శాతం పెరిగి 6.13 బిలియన్ డాలర్లకు చేరాయి.
