చిట్యాల/ రేగొండ, వెలుగు : దేవాదుల ప్రాజెక్టు నీళ్లతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవదుల ప్రాజెక్టు నీళ్లతో రామప్ప, గణపురం చెరువులను నింపడంతో పాటు డీబీఎం 38 ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా, గోరుకొత్తపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని చెరువులను నింపి సుమారు 45 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం రేగొండ మండలం దమ్మపేట, దుంపీలపల్లి, రేగొండ రైతువేదికలు, మడతపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్‌కార్డులను అందజేశారు. ప్రపంచ జానపద దినోత్సవాల్లో పాల్గొని జానపద కళాకారుల ప్రదర్శనలను తిలకించి, కళాకారులను అభినందించారు.
