గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి ధనసరి సీతక్క

గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి ధనసరి సీతక్క

ఏటూరునాగారం/ మంగపేట, వెలుగు: ములుగు జిల్లాలో గ్రామాల సమగ్ర అభివృద్ధి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. బుధవారం తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో రూ.4.46 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తాడ్వాయి వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.83 లక్షల పనులకు శంకుస్థాపన చేయగా, ఏటూరునాగారం మండలం శివాపూర్‌‌‌‌లో రూ.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ప్రారంభించారు. గోగుపల్లిలో రూ.55 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును అందుబాటులోకి తెచ్చారు. ఏటూరునాగారం మార్కెట్ యార్డులో రూ.2.28 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రామచంద్రాపూర్‌‌‌‌లో బంజారా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

అలాగే, మంగపేట మండలం గంపోనిగూడెం రైతు వేదికలో మంత్రి 43 మంది అర్హులకు చేయూత పింఛన్ పత్రాలను అందించారు. మండలంలో సుమారు రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, దుగినెపల్లి–ఏటూరునాగారం ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.43 కోట్లు కేటాయించి టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 31లోపు చేయూత పింఛన్, రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం మల్లూరులో కొత్తగా నిర్మించిన ముత్యాలమ్మ ఆలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.