సౌత్ ఇండియన్స్‌‌పై సైబర్ నేరగాళ్ల గురి...టెలీకాలర్లతో స్థానిక భాషల్లో మాట్లాడిస్తూ మోసం

సౌత్ ఇండియన్స్‌‌పై సైబర్ నేరగాళ్ల గురి...టెలీకాలర్లతో స్థానిక భాషల్లో మాట్లాడిస్తూ మోసం

85 ఏండ్ల రిటైర్డ్‌‌ బ్యాంకు ఉద్యోగిని ఎన్‌‌ఐఏ పేరుతో సైబర్‌‌ నేరగాళ్లు డిజిటల్‌‌ అరెస్ట్‌‌ చేశారు. ఆర్‌‌‌‌బీఐ, ఆధార్‌‌ దుర్వినియోగం పేరుతో రూ.85.20 లక్షలు వసూలు చేశారు. మరో రూ.42 లక్షలు అడగడంతో అనుమానం వచ్చిన బాధితుడు నేషనల్‌‌ సైబర్‌‌ క్రైమ్‌‌ రిపోర్టింగ్‌‌ పోర్టల్‌‌తో పాటు సైబర్‌‌ క్రైమ్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన టీజీసీఎస్‌‌బీ అధికారులు బాధితుడికి ఫోన్‌‌ చేసిన మహిళ తెలుగులో మాట్లాడినట్టు గుర్తించారు. కోయంబత్తూరులోని ఐడీఎఫ్‌‌సీ బ్యాంకులో జమ చేసిన రూ.85.20 లక్షలను ఫ్రీజ్‌‌ చేశారు.

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఫేక్ బజాజ్‌‌ ఫైనాన్స్‌‌ కాల్‌‌సెంటర్‌‌లో జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌‌లోని సైదాబాద్‌‌, బోరబండ, మహబూబ్‌‌నగర్‌‌ ప్రాంతాలకు చెందిన తెలుగు మహిళలు టెలీకాలర్లుగా పనిచేస్తున్నారు. బజాజ్‌‌ ఫైనాన్స్‌‌ ప్రతినిధులమంటూ ఫోన్లు చేసి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని నమ్మించేవారు. లోన్​ ప్రాసెసింగ్‌‌ ఫీజు, వెరిఫికేషన్‌‌ చార్జీలు, డాక్యుమెంటేషన్‌‌ ఫీజు, బీమా ప్రీమియం పేరుతో డబ్బులు వసూలు చేసేవారు. గత వారం టీజీసీఎస్‌‌బీ నిర్వహించిన దాడుల్లో ఈ కాల్‌‌సెంటర్‌‌కు చెందిన 21 మంది తెలుగు మహిళలు పట్టుబడ్డారు.

  • ఢిల్లీలో కాల్‌‌ సెంటర్లు.. 21 మంది తెలుగు లేడీ టెలీకాలర్ల అరెస్ట్

హైదరాబాద్‌‌, వెలుగు: సైబర్‌‌ నేరగాళ్లు రూట్‌‌ మార్చారు. వివిధ బ్యాంకుల పేరుతో దక్షిణాది ఖాతాదారులను బురిడీ కొట్టించేందుకు స్థానిక భాషల్లో మాట్లాడే టెలీకాలర్లను నియమించుకుంటున్నారు. ఇందుకోసం ఢిల్లీ కేంద్రంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మాట్లాడే వారితో ఫేక్‌‌ కాల్‌‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఆన్‌‌లైన్‌‌ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌ పోస్టుల పేరుతో యువతను ఆకర్షించి.. జీతంతో పాటు కలెక్షన్ల ఆధారంగా కమీషన్లు ఇస్తామంటూ రిక్రూట్‌‌ చేసుకుంటున్నారు. ఇలా స్థానిక భాషల్లో మాట్లాడే వారితో సైబర్‌‌ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ కేంద్రంలోని నెట్‌‌వర్క్‌‌ను తెలంగాణ సైబర్‌‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌‌బీ) ఇటీవల ఛేదించింది. మూడు కాల్‌‌సెంటర్లపై దాడులు చేసి 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలీకాలర్లను అదుపులోకి తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన 22 సైబర్‌‌ నేరాలకు ఈ కాల్‌‌సెంటర్లతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించింది.

ఈజీ మనీ ఆశ చూపి..

నార్త్‌‌లో ఉండే సైబర్​నేరగాళ్లకు దక్షిణాదిలో భాష సమస్యగా మారింది. హైదరాబాద్‌‌ మినహా ఏపీ, తమిళనాడు, కేరళ, కర్నాటకలో స్థానిక భాషల్లో మాట్లాడలేకపోతున్నారు. దీంతో తెలుగు సహా దక్షిణాది భాషలు మాట్లాడే వారిని ట్రాప్‌‌ చేసి తమ నెట్‌‌వర్క్‌‌లో చేర్చుకుంటున్నారు. ఆయా ప్రాంతాలకు టూరిస్టులుగా వెళ్లి ముందుగా షెల్టర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. 

క్యాబ్‌‌, ఆటో డ్రైవర్లు, స్థానిక కన్సల్టెన్సీల ద్వారా నెట్‌‌వర్క్‌‌ పెంచుకుంటున్నారు. చదువుతో సంబంధం లేకుండా స్థానిక భాషను స్పష్టంగా మాట్లాడేవారికి శిక్షణతోపాటు ఉద్యోగాలు ఇస్తామంటూ నమ్మిస్తున్నారు. ఇలా ఈజీ మనీ ఆశ చూపి  ముఖ్యంగా 35 నుంచి 40 ఏండ్ల మధ్య వయసున్న తెలుగు మహిళలను టెలీకాలర్లుగా నియమించుకుంటున్నారు. మహిళలతో ఫోన్లు చేయిస్తూ బాధితులను సులభంగా నమ్మిస్తున్నారు. ముందుగానే సిద్ధం చేసిన స్క్రిప్ట్‌‌ ప్రకారం టెలీకాలర్లు మాట్లాడేలా శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్‌‌పై అవగాహన లేకపోయినా బేసిక్‌‌ ఫోన్లతోనే కాల్స్‌‌ చేయిస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులను టార్గెట్‌‌ చేస్తున్నారు. రాజస్తాన్‌‌లోని భరత్‌‌పూర్‌‌, జార్ఖండ్‌‌, పశ్చిమబెంగాల్‌‌ సహా నార్త్‌‌ ఇండియాలో ట్రైనింగ్‌‌, కాల్‌‌సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు.

టెలీకాలర్లకు శిక్షణ.. కమీషన్లు..

బ్యాంకు అధికారులుగా మాట్లాడడం నుంచి బాధితులను ట్రాప్‌‌ చేసే వరకు టెలీకాలర్లకు శిక్షణ ఇస్తున్నారు. హిందీ మాట్లాడేవారికి నార్త్‌‌ ఇండియా, తెలుగు, ఇతర దక్షిణాది భాషలు మాట్లాడేవారికి ఆయా ప్రాంతాల ఫోన్‌‌ నంబర్లు అందిస్తున్నారు. బేసిక్‌‌ ఫోన్లతో రోజూ సుమారు 100 మందికి కాల్స్‌‌ చేయిస్తున్నారు. టార్గెట్‌‌ పూర్తి చేసిన వారికి దోచుకున్న మొత్తంలో సుమారు 30 శాతం కమీషన్‌‌ ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. స్పందించిన వారి ప్రాంతాన్ని బట్టి సమీపంలోని బ్యాంకులు, కార్యాలయాల వివరాలు చెబుతూ అక్కడి నుంచే ఫోన్‌‌ చేస్తున్నట్టు నమ్మిస్తున్నారు. అనంతరం అప్రూవల్స్‌‌, రిజిస్ట్రేషన్‌‌ ఫీజు, సర్వీస్‌‌ చార్జీలు, పన్నుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.