- సమగ్ర విచారణకు ఆదేశించాలి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్, 22 ఏ నిబంధన పేరుతో లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ దందా సాగుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బాధితులకు అండగా నిలిచేందుకు సెప్టెంబరు 5, 6 తేదీల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. బుధవారం రాష్ట్రంలో భూభారతి, 22ఏ తదితర అంశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు.
రాజ్యాంగ నైతికత గురించి మాట్లాడే రాహుల్ గాంధీ.. తన పార్టీ పాలిస్తున్న రాష్ట్రంలో మంత్రులు పాల్పడుతున్న అక్రమాలను, రాజ్యాంగ ఉల్లంఘనలను ఎందుకు ప్రశ్నించడం లేదని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ ను అడ్డుపెట్టుకుని ప్రైవేట్, మధ్యతరగతి ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి మారుస్తున్నారని లేఖలో ఆరోపించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖలో జరుగుతున్న చీకటి ఒప్పందాలు, షెల్ కంపెనీల బదలాయింపులపై స్పందించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో పేదల భూములు అన్యాక్రాంతమవుతుంటే రాహుల్ గాంధీ మౌనం వీడాలని, ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
వచ్చే నెల 5, 6 తేదీల్లో నిరసన దీక్షలు
భూభారతితో లక్షలాది మంది ప్రజలు, రైతులు, భూ హక్కుదారులకు మద్దతుగా బీజేపీ పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సెప్టెంబరు 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, బాధితులు ఈ దీక్షల్లో పాల్గొంటారని తెలిపారు. నిరసన దీక్షల తర్వాత కూడా ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే..అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు.
