సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట నియోజకవర్గం, ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో ఉన్న దండుమైసమ్మ తల్లి దేవస్థాన అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టూరిజం శాఖ ద్వారా రూ.2.50 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో దేవస్థాన పరిసరాల్లో 28 వసతి గదులు, 14 వంట గదులు కిచెన్ షేడ్స్, టాయిలెట్స్ బ్లాక్స్ 2, వాటర్ ట్యాంకుతో పాటు భక్తులకు అవసరమైన పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసి, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించిన టూరిజం శాఖ మంత్రివ జూపల్లి కృష్ణారావుకు, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఎండీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
