స్కిల్ క్యాపిటల్గా తెలంగాణ..స్కిల్లింగ్‌‌, అప్‌‌స్కిల్లింగ్‌‌, రీస్కిల్లింగ్‌‌లో భాగస్వాములవ్వండి

స్కిల్ క్యాపిటల్గా తెలంగాణ..స్కిల్లింగ్‌‌, అప్‌‌స్కిల్లింగ్‌‌, రీస్కిల్లింగ్‌‌లో భాగస్వాములవ్వండి
  •     పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్​ బాబు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను స్కిల్‌‌ క్యాపిటల్‌‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్కిల్లింగ్‌‌, అప్‌‌స్కిల్లింగ్‌‌, రీస్కిల్లింగ్‌‌ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి  శ్రీధర్‌‌బాబు పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన ‘రెడీ టూ వర్క్‌‌ ఫోర్స్‌‌’గా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. బుధవారం బంజారాహిల్స్‌‌లోని తాజ్‌‌ కృష్ణాలో బోయింగ్‌‌, లెర్నింగ్‌‌ లింక్స్‌‌ ఫౌండేషన్‌‌ (ఎల్‌‌ఎల్‌‌ఎఫ్‌‌), సెంట్రల్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ టూల్‌‌ డిజైన్‌‌ (సీఐటీడీ) కలిసి నిర్వహించిన ‘బోయింగ్‌‌ స్కిల్లింగ్‌‌ ప్రోగ్రామ్‌‌’ను విజయవంతంగా పూర్తి చేసిన యువత, దివ్యాంగులు, వెటరన్స్ కు ఆయన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మంత్రి శ్రీధర్‌‌బాబు మాట్లాడుతూ.. టెక్నాలజీ, ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయన్నారు. 

ఆ దిశగా యువతను తీర్చిదిద్దాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, నిపుణులు, విద్యా సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించాలనే సంకల్పంతో రాష్ట్రంలో స్కిల్లింగ్‌‌ ఎకోసిస్టమ్‌‌ను బలోపేతం చేస్తున్నామన్నారు. యంగ్‌‌ ఇండియా స్కిల్స్‌‌ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. ఆధునిక, పరిశ్రమ ఆధారిత శిక్షణను అందించేందుకు ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌‌డ్‌‌ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.