రన్..మారథాన్..భారీ ఈవెంట్కు సిటీ రెడీ..ఆగస్టు 29, 30 తేదీల్లో మారథాన్

రన్..మారథాన్..భారీ ఈవెంట్కు సిటీ రెడీ..ఆగస్టు 29, 30 తేదీల్లో మారథాన్
  • దేశ, విదేశాల నుంచి హాజరుకానున్న 32 వేల మంది
  •     కెన్యా, ఇథియోపియా నుంచి 10 మంది ఎలైట్​ రన్నర్స్
  •      పార్టిసిపేట్​ చేయనున్న ఐఏఎస్, ఐపీఎస్​, ప్రముఖులు
  •     ప్రైజ్​మనీ అరకోటికి పైనే.. 

హైదారాబాద్​సిటీ, వెలుగు : నగరం మరో భారీ ఈవెంట్​కు సిద్ధమవుతోంది. హైదరాబాద్ ​రన్నర్స్​ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో మారథాన్​ నిర్వహించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ రన్​లో దేశ విదే శాల నుంచి 32 వేల మంది తరలిరానున్నారు. హైదరాబాద్, సైబరాబాద్​లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ఐఏఎస్​లు, ఐపీఎస్​లు, ఇతర అధికారులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పార్టిసిపేట్​ చేయబోతున్నారు. పరుగుల చిరుతలుగా పేరుగాంచిన కెన్యా, ఇథియోపియాతో పాటు మన దేశానికి చెందిన  ఎలైట్​ రన్నర్స్​  ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నరు. నగర ఖ్యాతిని పెంచే ఈ మారథాన్​ కోసం పోలీసు, బల్దియా  ఏర్పాట్లు చేస్తోంది.  

హాఫ్​, ఫుల్​ మారథానే ఇంపార్టెంట్​

మారథాన్​లో 5 కిలోమీటర్ల రన్​ను 29న ఉదయం 7 గంటలకు హైటెక్ ​సిటీ దగ్గర ప్రారంభించనున్నారు. ఇది మెటల్​ చార్మినార్​ మీదుగా నోవాటెల్​ఎంట్రెన్స్​ నుంచి తిరిగి హైటెక్​సిటీకి చేరుకోనున్నది. 10 కేఎంను 30న ఉదయం 7 గంటలకు హైటెక్స్​నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు కండక్ట్​ చేస్తారు.   హాఫ్ ​మారథాన్​21.1 కిలోమీటర్లను 30న తెల్లవారుజామున ఐదున్నర గంటలకు పీపుల్స్​ప్లాజా వద్ద మొదలుపెడతారు. రాజ్‌‌భవన్ రోడ్, బంజారా హిల్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, గచ్చిబౌలి ఐటీ కారిడార్ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. 

అత్యంత ప్రధానమైన ఫుల్ ​మారథాన్ ​నెక్లెస్ ​రోడ్డులో అదే రోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు స్టార్టవుతుంది. హుస్సేన్ సాగర్ లేక్ చుట్టూ 9.5 కిలోమీటర్ల వరకు సాగి  రాజ్‌‌భవన్ రోడ్, పంజాగుట్ట, బంజారాహిల్స్ (కేబీఆర్ పార్క్) జూబ్లీహిల్స్ చెక్‌‌పోస్ట్ మీదుగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మైండ్‌‌స్పేస్, బయోడైవర్సిటీ జంక్షన్ , సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లోపలకు వెళ్లి చివరకు గచ్చిబౌలి స్టేడియం వద్ద  ముగుస్తుంది.

ఎవరెవరు పాల్గొనబోతున్నారు? 

 ఇండియాలో సెకండ్ ​బిగ్గెస్ట్ ​మారథాన్​గా హైదరాబాద్​ మారథాన్​కు పేరుంది. అందుకే దేశ విదేశాల నుంచి ఇక్కడకు వచ్చి రన్​లో పాల్గొనేందుకు చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. దాన్ని నిరూపిస్తూ ఈసారి ఏకంగా 32 వేలమంది రన్నర్లు రిజిస్ట్రేషన్ ​చేయించుకున్నారని రన్​ మీడియా కో ఆర్డినేటర్ ​పీవీఎస్ ​ప్రసాద్​ వెల్లడించారు. గత ఏడాది కంటే ఈసారి 5వేల మంది పెరిగారన్నారు. 18 ఏండ్ల నుంచి మొదలుకుంటే  80 ఏండ్ల వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొంటారు. ఆఫ్రికా దేశాల నుంచి 10 మంది, మన దేశం నుంచి 40 మంది ఎలైట్​రన్నర్లు, సైబరాబాద్ ​సీపీ రమేశ్, సిటీ ట్రాఫిక్​సీపీ జోయల్​డేవిస్, శ్వేత, వినీత్ తో కలిపి సుమారు 100 మంది వరకు పోలీస్​అధికారులు, 1500 మంది డాక్టర్లు, సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు.  

అంధులు..దివ్యాంగులు..కూడా..

ఈసారి 300 మంది దివ్యాంగులు, మానసిక వికలాంగులు, అంధులు రన్​లో పాల్గొంటున్నారు.  అడ్వెంచర్స్ బియాండ్ బారియర్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఇన్‌‌క్లూజివ్ రన్  గా దీన్ని నిర్వహిస్తున్నారు. అంధులకు  గైడ్ రన్నర్స్, సహాయకులు చేయి పట్టుకుని, తాడుతో వారికి రూట్​గైడ్ ​చేస్తారు.  
 
సిద్ధమైన రెండు కమిషనరేట్లు  

ఈ ప్రోగ్రామ్​ సక్సెస్​ చేయడానికి హైదరాబాద్​, సైబరాబాద్​ పోలీస్​, మున్సిపల్ ​కమిషనర్లు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాండ్​ ఈవెంట్​ కావడంతో  రోడ్లు, పరిసరాలను క్లీన్​ చేస్తున్నారు. మారథాన్​ రూట్​లో ఎక్కడా రోడ్లపై గుంతల్లేకుండా చూస్తున్నారు. ట్రాఫిక్​ పోలీసులు ట్రాఫిక్​ఆంక్షలతో పాటు పలు చోట్ల మళ్లింపులు అమలు చేయనున్నారు. 

టెక్నాలజీ అదుర్స్​ 

పరుగులో పాల్గొనే ప్రతి ఒక్కరి టైమింగ్​, ఇతర విషయాలు తెలుసుకోవడానికి రన్నింగ్ బిబ్  అమర్చనున్నారు. ప్రతి రన్నర్​చెస్ట్ నంబర్ వెనుక ఒక చిన్న ఎలక్ట్రానిక్ రేడియో ఫ్రీక్వెన్సీ చిప్ అమర్చబడి ఉంటుంది. దీనివల్ల పరుగును ఎప్పుడు ప్రారంభించారు? ఎంత స్పీడ్​తో పరిగెత్తుతున్నారు ? ఏ ఏ ఏరియాలను ఎప్పుడు దాటారు? గమ్యస్థానాన్ని ఎంత సమయంలో చేరుకున్నారు? అనే విషయాలను ఈ చిప్ మిల్లీసెకన్ల తేడాతో ఖచ్చితంగా లెక్కిస్తుంది. దీని ఆధారంగానే టైమింగ్ సర్టిఫికేట్ అందజేస్తారు 

250 మంది డాక్టర్లు, సిబ్బంది..అంబులెన్సులు

రన్​లో పాల్గొన్నవారు అస్వస్థతకు గురైతే వైద్యం చేసేందుకు అపోలో హాస్పిటల్​సహకారంతో స్పెషల్​ క్యాంప్స్​ ఏర్పాటు చేశారు. 16 చోట్ల 250 మంది డాక్టర్లు, నర్సులు, సిబ్బందితో పాటు 16 అంబులెన్సులు, 12 బైక్​ అంబులెన్సులతో సేవలందించనున్నారు. ప్రతి రెండు కిలోమీటర్లకో హైడ్రేషన్​ స్టేషన్ పెట్టి నీళ్లు, బిస్కెట్స్​, పండ్లు, హైడ్రేషన్​డ్రింక్స్​ అందించనున్నారు. 

  • ఈ మారథాన్ ప్రైజ్​మనీని 56.5 లక్షలు. దీన్ని వేర్వేరు విభాగాల్లో 40 మందికి అందజేయనున్నారు. 
  • 40కి పైగా స్వచ్ఛంద సంస్థల కోసం రూ4 కోట్ల విరాళాలు సేకరించి అందజేయనున్నారు.  
  • రన్​ను అబ్జర్స్ ​చేయడానికి, కవరేజ్​కోసం ఈసారి డ్రోన్​కెమెరాలు వినియోగిస్తుండడం విశేషం.. 
  • ఈ మారథాన్​ వల్ల సిటీ, స్టేట్​ టూరిజానికి బూస్ట్​ వస్తుంది. రన్నర్లు కుటుంబసభ్యులతో నగరం,  తెలంగాణ  పర్యాటక ప్రాంతాలను విజిట్​చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల  హోటల్​, ఫుడ్​ ఇండస్ట్రీకి డిమాండ్ ​పెరుగుతుంది.  

మొదటి 3 వరుసల్లో మహిళలే

విమెన్​ ఫస్ట్​ స్టార్ట్​లైన్​ పేరుతో ఈసారి మొదటి మూడు లైన్లలో మహిళలే నిల్చోనున్నారు. మహిళా రన్నర్లకు సురక్షితమైన, సమానమైన, ప్రత్యేకమైన గౌరవాన్ని అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. షీ రేసెస్ ​అనే సంస్థ ఇందులో కీలకపాత్ర పోషించింది. 32 వేల మందిలో 16 శాతం అంటే ఐదు వేలకు పైగా మంది మహిళలే పాల్గొనబోతున్నారు. వీరి కోసం దారి పొడవునా విమెన్ ​కేర్​స్టేషన్స్ ​ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ లేడీస్​టాయిలెట్స్​, శానిటరీ న్యాప్​కిన్స్, వెట్​టిష్యూస్ వంటి ఏర్పాట్లుంటాయి.  

కమాన్​..కదిలిరండి  

దేశంలో ఎక్కడ మారథాన్​ నిర్వహించినా అక్కడి ప్రజలు కదిలివస్తారు. రూట్ ​పొడవునా నిలబడి  చప్పట్లతో రన్నర్లను ఉత్సాహపరుస్తారు. కానీ, 2012 నుంచి క్రమం తప్పకుండా హైదరాబాద్​ మారథాన్​ నిర్వహిస్తున్నా  ప్రజాదరణ కరువైంది. రోడ్లపై రన్నర్లు తప్ప జనం జాడ లేదు. అందుకే 29, 30 తేదీల్లో ప్రజలంతా తరలివచ్చి రన్నర్లను ఎంకరేజ్​ చేయాలని హైదరాబాద్​ రన్నర్స్​ అధ్యక్షుడు అరుణ్​కుమార్​, రేస్​ డైరెక్టర్​ రాజేశ్​ పెచ్చార్, అంకం వెంకట్, ఎన్జీవోస్ ​ఇన్​చార్జి స్మితా, విజ్ఞప్తి చేస్తున్నారు.