తాగి బండి నడిపితే... రూ.10 వేలు కట్టాల్సిందే !

తాగి బండి నడిపితే... రూ.10 వేలు కట్టాల్సిందే !
  • 319 మందికి రూ.31.90 లక్షల జరిమానా 
  • జిల్లాలో ఈఏడాది ఇప్పటివరకే  6,575 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

మెదక్, వెలుగు: మెదక్​ జిల్లాలోని 44, 161, 765 డి నేషనల్ హైవే లు, రాష్ట్ర, జిల్లా రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతోంది.

ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ లో భాగంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయా రహదారుల్లో బ్రీత్ ఎనలైజర్ తో టెస్టు చేస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

6,575  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. 
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 21 వరకు మెదక్​ జిల్లాలో 6,575  డ్రంక్ అండ్ డ్రైవ్  కేసులు నమోదు అయ్యాయి. కొద్ది రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారిని కోర్టులో ప్రవేశ పెడుతుండగా జడ్జి రూ.10 వేల ఫైన్ విధిస్తున్నారు. ఇటీవల కాలంలో 319 మందికి ఒక్కొకరికి రూ.10 వేల చొప్పున రూ.31.90 లక్షల జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు, కోర్టు సైతం సీరియస్ గా తీసుకొని రూ.10 వేలు జరిమానా విధిస్తుండటంతో మద్యం సేవించి వాహనం నడపడానికి జంకుతున్నారు.

గత 15 రోజుల్లో పరిస్థితి ఇదీ.. 
ఈ నెల 12న మెదక్ టౌన్ సీఐ మహేష్​ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురు పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్​ మండలం అంతపల్లికి చెందిన ఉప్పరి నాగరాజు, మెదక్​ మండలం రాజ్​ పల్లికి చెందిన  జంగిటి దేవయ్య, మెదక్​ పట్టణానికి చెందిన రవితేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని స్పెషల్ మొబైల్ మేజిస్ట్రేట్ సాయి ప్రభాకర్ ఎదుట హాజరుపరచగా, మద్యం సేవించి వాహనాలు నడిపిన ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. 

ఈ నెల 13న కొల్చారం ఎస్సై మహమ్మద్ మోహియుద్దీన్ ఆధ్వర్యంలో  నేషనల్​ హైవే 765 డి మీద కొల్చారంలో డ్రంక్​ అండ్ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు.  మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదుచేసి మెదక్ కోర్టులో హాజరు పరచగా మద్యం తాగి వాహనాలు నడిపిన తారా సింగ్,  విక్రమ్ కుమార్ లకు జడ్జి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు.

ఈ నెల 17న  మెదక్​ పట్టణంలో నిర్వహించిన డ్రంక్​ అండ్​ డ్రైవ్​  తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన రామాయంపేట మండలం లక్ష్మాపూర్​ కు చెందిన రాగుల మహెందర్​, నిజాంపేట మండలం చల్మెడకు చెందిన బైండ్ల రాజ్​ కుమార్, మెదక్​ మండలం ముగ్దుంపూర్​ కు చెందిన అన్నవరం బన్నీకి స్పెషల్​ మొబైల్​ మెజిస్ట్రేట్​ ఒక్కొక్కరికి రూ.10 వేల  చొప్పున జరిమానా విధించారు.