- స్పష్టం చేసిన కర్నాటక సీఎం డీకే శివకుమార్
- అన్ని వర్గాలను కలుపుకొనిపోవడమే తమ సిద్ధాంతమని వెల్లడి
బెంగళూరు: ప్రభుత్వ, ప్రజా కార్యక్రమాల్లో ఇకపై వందేమాతర గీతంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని తెలిపారు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను ఆలపించడంపై స్పందిస్తూ.. అది తనకు తెలియకుండా జరిగిందన్నారు. ‘‘నేను మా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఏ నిర్ణయం తీసుకున్నామో దానికి కట్టుబడి ఉంటా. గవర్నర్ హౌస్‌లోగాని, నా ప్రమేయం లేకుండాగాని పూర్తి గీతాన్ని ఆలపించి ఉండొచ్చు.
ఇకపై మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల్లో గతంలో నిర్ణయించినట్లుగానే తొలి రెండు చరణాలనే పాడుతాం’’ అని ఇండియా టుడే నిర్వహించిన రౌండ్‌టేబుల్ కార్యక్రమంలో శివకుమార్ చెప్పారు. భారత్ భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, వర్గాలతో కూడిన దేశమని అన్నారు. బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్లడాన్నే కొనసాగిస్తుందని చెప్పారు. హిందూ, హిందూత్వంపై ప్రశ్నకు స్పందిస్తూ.. గాలి, నీరు, సూర్యుడికి మతం లేదని, అందరూ ఒకే గాలిని పీల్చి, ఒకే నీటిని తాగాల్సిందేనన్నారు.
పార్టీ నిర్ణయాన్ని తప్పక పాటిస్తం
అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను తప్పనిసరిగా ఆలపించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టం చేసింది. దీనిని కాదంటూ కాంగ్రెస్ పార్టీ.. తొలి రెండు చరణాలనే పాడుతామని తీర్మానించింది. 1937లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్నే కొనసాగిస్తున్నామని, మిగిలిన చరణాల్లో హిందూ దేవతల ప్రస్తావన ఉండటంతో ఇతర వర్గాలకు అభ్యంతరాలు ఉండొచ్చని వాదిస్తోంది. ఇదే కారణంతో తొలి రెండు చరణాలకే పరిమితం కావాలన్న పార్టీ నిర్ణయాన్ని డీకే శివకుమార్ మరోసారి సమర్థించారు.
