- ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహారాజ్
ముషీరాబాద్, వెలుగు: సంక్షోభంలో ఉన్న తెలంగాణ విద్యా రంగం బాగు కోసం పోరాటం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విషారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర పాలకులకు చిత్తశుద్ధి కరువైందని మనసుపెట్టి పాలన చేస్తే విద్యా, వైద్య రంగాన్ని తెలంగాణలో గొప్పగా అభివృద్ధి చేయవచ్చని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల ధర్మ టీచర్స్ యూనిటీ ఆధ్వర్యంలో బుధవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్నేల లక్ష్మణ్, దామెర ఉపేందర్ అధ్యక్షతన విద్యా సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, విశారదన్ మహారాజ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఎంతో నష్టం కలుగుతుందని, వారి నుంచి విద్యను సంపూర్ణంగా తీసివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పీడిత వర్గాల మార్పు కోసం పని చేసే విద్యారంగా మేధావులు కృషి చేయాలన్నారు. వెంకట్ నారాయణ, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, కుమార్ స్వామి, ప్రభాకర్, రమేశ్, రాజు, అశోక్, జనార్ధన్, భూపతి పాల్గొన్నారు.
