ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తన 15 ఏళ్ల టెస్టు కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తన క్రికెట్ ప్రయాణంలో తొలిసారిగా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
బంగ్లాదేశ్‌తో మక్కాయ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో స్టార్క్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఈ మెరుగైన ప్రదర్శనే అతడిని ప్రపంచ నంబర్-వన్ పీఠంపై కూర్చోబెట్టింది.
ఇప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను స్టార్క్ వెనక్కి నెట్టాడు. 2024 ఫిబ్రవరి నుంచి టెస్టుల్లో నంబర్-వన్ ర్యాంక్‌ను కాపాడుకుంటూ వస్తున్న బుమ్రా... ప్రస్తుతం భారత్ తరఫున సిరీస్‌కు దూరంగా ఉండటం, మరోవైపు స్టార్క్ అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్లీ మూడో స్థానంలో నిలిచాడు.
ALSO READ : ఇంగ్లండ్ను వీడని మద్యం వివాదాలు..
ఇదే సిరీస్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆరో స్థానానికి ఎగబాకగా, స్పిన్నర్ నాథన్ లైన్ 10వ స్థానానికి చేరుకున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ నంబర్-వన్ స్థానాన్ని పదిలం చేసుకోగా... భారత్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రాణించి ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా తన నంబర్-వన్ స్థానాన్ని పదిలంగా కాపాడుకున్నారు.
