మంగళగిరిలో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్... శంకుస్థాపన చేయనున్న లోకేష్..

మంగళగిరిలో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్... శంకుస్థాపన చేయనున్న లోకేష్..

ఏపీలోని మంగళగిరిలో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతోంది. ఈ పనులకు సంబంధించి గురువారం ( ఆగస్టు 26 ) మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. మోడల్ రైతు బజార్ ను 5.90 ఎకరాల విస్తీర్ణంలో రూ.18 కోట్ల అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో పరిశుభ్రంగా, వినియోగదారులకు అనుకూలంగా, పర్యావరణహితంగా ఉండేలా ఈ రిటైల్, హోల్ సేల్ కూరగాయల మార్కెట్ ను నిర్మించనున్నారు. 

ఈ రైతు బజార్ మొత్తం నిర్మాణ విస్తీర్ణం 71వేల 925 చదరపు అడుగులుగా ఉండనుంది. రిటైల్ మార్కెట్ లో కూరగాయల విక్రయాల కోసం 102 స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాల కోసం 54 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటుచేయనున్నారు. ఇతర రకాల వస్తువుల కోసం మొత్తం 60షాపులు ఏర్పాటుచేస్తారు. అదేవిధంగా హోల్ సేల్ మార్కెట్లో అన్ లోడింగ్ ప్లాట్ ఫామ్స్ 18, కూరగాయల షాపులు 23 ఉండనున్నాయి. 61.4 చ.మీల విస్తీర్ణంలో కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియాస్, 144.6 చ.మీ విస్తీర్ణంలో అడ్మిన్, మెయింటెనెన్స్ ఏరియాస్, 190 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్యాంటీన్, ప్రజల కోసం 130 చ.మీల విస్తీర్ణంలో మరుగుదొడ్లు నిర్మించనున్నారు. 

సరుకులు తరలించే వాహనాలు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ కోసం పార్కింగ్ సౌకర్యం ఏర్పాటుచేయనున్నారు. వాటర్ సంప్, ఓవర్ హెడ్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్, ట్రాన్స్ ఫార్మర్, జనరేటర్, గార్బేజ్ కలెక్షన్, ఆర్గానిక్ కన్వర్టర్, టెర్రస్ సోలార్ ఎనర్జీ ప్యానల్స్ వంటి సదుపాయాల కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు.