విద్యార్థులకు సమాధానం చెప్పలేక పోలీసులతో అణచివేత.. బిహార్ సర్కారుపై రాహుల్గాంధీ ఫైర్

విద్యార్థులకు సమాధానం చెప్పలేక పోలీసులతో అణచివేత.. బిహార్ సర్కారుపై రాహుల్గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకలు, పేపర్​లీక్​ఘటనలపై నిరసన చేపడుతున్న విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేక పోలీసులతో అణచివేస్తున్నదని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బాధ్యత నుంచి తప్పించుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పోలీసులను ఆయుధంగా వాడుకుంటోందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

పాట్నాలో జరిగిన విద్యార్థుల నిరసనలో ఆదిత్య అనే ఆరేండ్ల బాలుడు ధైర్యంగా, పదునైన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, రాహుల్​ గాంధీ ఎక్స్​ వేదికగా స్పందిస్తూ.. ‘బిహార్ విద్యార్థులు చాలా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు.

నియామక పరీక్షలలో ఎందుకు అవకతవకలు జరుగుతున్నాయి..? పేపర్ లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? యువత భవిష్యత్తుతో ఈ చెలగాటం ఇంకెంతకాలం కొనసాగుతుంది..? బీపీఎస్సీ పరీక్షల వివాదం ఈనాటిది కాదు.

నియామక ప్రక్రియ, పరీక్ష విధానం, జాప్యం, పారదర్శకతపై విద్యార్థులు చాలాకాలంగా వీధుల్లోకి వస్తున్నారు. వారికి ప్రభుత్వం సమాధానం చెప్పకపోగా లాఠీలు, వాటర్ కెనాన్లు ప్రయోగిస్తోంది. విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నది. సివాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరసనకారులపై ఏకే-47తో కాల్పులు కూడా జరిగాయి. 

ఇది కేవలం పోలీసుల చర్యలకు సంబంధించిన ప్రశ్న కాదు. ఇది సమాధానాలు లేని బీజేపీ ప్రభుత్వ మనస్తత్వానికి సంబంధించిన ప్రశ్న. అందుకే జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి పోలీసులను ఆయుధంగా మార్చుకుంటున్నది. కానీ, ప్రశ్నలు లాఠీలతో ఆగవని బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి’ అని రాహుల్ ​పేర్కొన్నారు.

భయపెట్టి భవిష్యత్తును లాక్కోలేరు

భయం పుట్టించడం ద్వారా ఎవరి భవిష్యత్తునూ లాక్కోలేరని రాహుల్​ గాంధీ అన్నారు. బిహార్ విద్యార్థులు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారని హెచ్చరించారు. ఇప్పుడు వారికి కేవలం సమాధానం మాత్రమే కాదు.. జవాబుదారీతనాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.