సామాన్యుడికి అచ్ఛే దిన్ ఎక్కడ..?  పండుగల వేళ నిత్యావసరాల ధరల పెంపుపై ఖర్గే ఫైర్

సామాన్యుడికి అచ్ఛే దిన్ ఎక్కడ..?  పండుగల వేళ నిత్యావసరాల ధరల పెంపుపై ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: పండుగల వేళ నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. సామాన్యుడికి బీజేపీ హామీ ఇచ్చిన ‘అచ్ఛే దిన్’ ఎక్కడని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. పండుగల సమయంలో సామాన్యుడి వంటగది పరిస్థితి దయనీయంగా మారిందని.. ఏడాది కాలంలో ఉల్లి ధరలు 59 శాతం వరకు పెరిగి అనేక నగరాల్లో కిలో రూ. 50 నుంచి 60కి చేరాయని ఆయన ధ్వజమెత్తారు. 

చక్కెర కిలో రూ.60 నుంచి రూ.70కి చేరిందని, ఆవనూనె లీటరు రూ.200 పైమాటే ఉందన్నారు. ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణం 5.52 శాతంగా, టోకు ద్రవ్యోల్బణం 9.78 శాతంగా నమోదైందని వివరించారు. ఎన్డీయే ప్రభుత్వానికి 12 ఏండ్లు పూర్తయినా ‘అచ్ఛే దిన్’ అసలు రూపం ఇదేనని.. పప్పు దినుసులు, కూరగాయలు, నూనెలు, చక్కెర సామాన్యుడి బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీస్తూనే ఉన్నాయని విమర్శించారు. 

ధరలు ఇలా పెంచుకుంటూ పోతే పేద, మధ్యతరగతి ప్రజలు ఎలా బతుకుతారో చెప్పాలని కేంద్రాన్ని ఆయన నిలదీశారు. పెట్రోల్, నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు దీన్ని ఎప్పటికీ క్షమించరని ఖర్గే పేర్కొన్నారు. ఆహార ధరల ద్రవ్యోల్బణంతో సామాన్యుడి బడ్జెట్ కుప్పకూలుతోందన్నారు. బీజేపీ అర్థంలేని మాటలతో జవాబుదారీతనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని.. అయితే, ద్రవ్యోల్బణంపై ప్రజలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని కాంగ్రెస్​ చీఫ్​ మల్లికార్జున్ ఖర్గే హెచ్చరించారు.